Chandrababu, Pawan Kalyan: ఎన్నికల బృందంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు.
- IndiaGlitz, [Tuesday,January 09 2024]
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లోనే పోలింగ్ జరగనుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల ఖరారుతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో రాజకీయ పార్టీల నేతలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. ఓట్ల జాబితాలో అవకతవకలు, ఎన్నికల విధులు తదితర అంశాలపై చర్చించనుంది. అలాగే ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించనుంది. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సోమవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు.
ఇవాళ(మంగళవారం), రేపు(బుధవారం) రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ముందుగా ప్రధాన పార్టీలైన నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి హాజరయ్యారు. అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మార్గాని భరత్తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలను ఆయా పార్టీల నేతలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతలతో చర్చ అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు.
అనంతరం రేపు ఎన్నికల సన్నద్ధతపై సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికల విధులకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతారు. రాజకీయ పరిస్థితులు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో నెలకొన్న ఇబ్బందులు, నమోదు ప్రక్రియకు అవసరమైన సమయంపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. తదుపరి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కేంద్ర ఎన్నికల బృందం పర్యటనతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైందనే చెప్పాలి.
ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి తొలి వారంలో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం ఆరు లేదా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని సీఈసీ అధికారులు భావిస్తున్నారు. ముందుగా తొలి దశలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు తమిళనాడు లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గత రెండు రోజులు తమిళనాడులో ఎన్నికల అధికారులు పర్యటించారు. మొత్తానికి వచ్చే రెండు, మూడు నెలలు దేశంలో ఎన్నికల కోలాహలం ఉండనుంది.