Chandrababu-Pawan: ఎన్నికల్లో ఎలా ముందుకెళ్దాం.. చంద్రబాబు, పవన్ సుదీర్ఘ చర్చలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ .. మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే హైదరబాద్‌తో పాటు విజయవాడలో పలు మార్లు చంద్రబాబు భేటీ అయిన పవన్ కల్యాణ్.. తొలిసారి ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అనంతరం డిన్నర్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్, నాదెండ్ల మనోహర్ సైతం హాజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి.. జనసేనకు ఏ నియోజకవర్గాలు కేటాయించాలనే దానిపై స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.
అలాగే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించేలా కార్యాచరణ కూడా రూపొందించినట్లు కూడా తెలుస్తోంది. మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 60-70 మంది అభ్యర్థులతో టీడీపీ తొలిజాబితాను రెడీ చేసినట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేనకు 25-30 స్థానాలు కేటాయించినట్లు పేర్కొంటున్నాయి. కానీ కాపు పెద్దలు మాత్రం జనసేన కచ్చితంగా 40 స్థానాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రెండున్నరేళ్లు సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టాలని కూడా సూచిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తుందని.. చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసి ఇరువురు నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. అంతకుముందు యువగళం పాదయాత్రం ముగింపు సభలో కూడా పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తానికి టీడీపీ-జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments