జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తంపై చంద్రబాబు రియాక్షన్!
- IndiaGlitz, [Saturday,May 04 2019]
ఏపీ ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే రెండోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ నేతలు, చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మరో ముందడుగేసిన వైసీపీ నేతలు ఇప్పటికే ‘ఏపీ సీఎం వైఎస్ జగన్’ అని శిలాఫలకాలు, మంత్రి పదవులు పంపకాలు, జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారాలపై టీడీపీ అధిపతి చంద్రబాబు తాజాగా స్పందించారు. శనివారం నాడు రాజమండ్రి పార్లమెంట్ సమీక్షలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని.. ముఖ్యంగా టీడీపీకి నష్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చేయని ప్రయత్నం లేదని.. ఆయనతో పాటు తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నష్టం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారన్నారు. వీరిద్దరి కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోడయ్యారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
శిలాఫలకం, ముహూర్తంపై బాబు రియాక్షన్..
వైసీపీ మైండ్ గేమ్స్ ఎప్పుడూ ఉండేవే. ఇదికూడా మైండ్ గేమే. ప్రమాణ స్వీకారానికి మహూర్తాలు, మంత్రి పదవుల ఖరారు, అన్నీ మైండ్ గేమ్‌లో అంకాలే. పోటికి అభ్యర్ధులే లేనప్పుడు సర్వేలతో మైండ్ గేమ్ ఆడారు. ఊగిసలాడే వాళ్లు కొందరు ఆ పార్టీలో చేరారు. హింసా విధ్వంసాలకు స్కెచ్‌లు వేశారు.. అక్కడక్కడా కొన్ని అమలు చేశారు కూడా. ఓటింగ్ శాతం తగ్గించే కుట్రలు చేశారు.
ఎన్నికల రోజు తొలిగంటలోనే భారీగా ఓటర్లు తరలివచ్చారు. చూడగానే తెలుగుదేశం గెలుపు ఖాయం అనేది తేలిపోయింది. అందుకే పోలింగ్ శాతం దెబ్బతీసే పథక రచన చేశారు. ఉదయం 11గంటలకే తాడిపత్రిలో హత్య, రాజుపాలెంలో స్పీకర్‌పై దాడికి వైసీపీ నేతలు తెగబడ్డారు. హింసా విధ్వంసాలపై మీడియాలో పెద్దఎత్తున ప్రసారాలు. ఒక ఫక్కా ప్లాన్ ప్రకారం అరాచకానికి పథకం వేశారు. అది చూసి ఓటర్లు ఓటింగ్‌కు రారనే పథకం వేశారు. దీంతో మనం ఓటర్లకు పదేపదే పిలుపిచ్చాం ఓటింగ్‌కు రావాలని కోరాం. మీడియా, సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశం అందరికీ చేరింది అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మళ్లీ 1985 ఎన్నికల పట్టుదల కనబడింది!
సాయంత్రం 5గంటల కల్లా ఓటర్లంతా బారులు తీరారు. ఉదయం వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి ఓటింగ్‌కు వచ్చారు. అసలు ఇలా జరుగుతుందని వైసీపీ కాంగ్రెస్, బీజేపీ కలలో కూడా ఊహించలేదు. సాయంత్రం 5గంటలకు వచ్చిన ఓటర్లు అర్ధరాత్రిదాకా క్యూలో ఉండి మరీ ఓట్లేశారు. 1985 ఎన్నికల్లో కనబడిన పట్టుదల ఇప్పుడు మళ్లీ ప్రజల్లో,ఓటర్లలో కనబడింది. ఓటు హక్కు వినియోగంలో వారు చూపిన పట్టుదల ప్రజాస్వామ్యానికే ప్రాణం పోసింది. ఈ ఎన్నికల్లో గెలిచేది మనమే, అందులో సందేహం లేదు. ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ సీటులో ఎంత ఆధిక్యత వస్తుంది..? అనేది ఇప్పుడు ముఖ్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా మే-23న ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.