నా ప్రాణానికి ఏమైనా జరిగితే... జగన్‌ సర్కార్‌కు చంద్రబాబు వార్నింగ్!

  • IndiaGlitz, [Friday,July 05 2019]

నా ప్రాణానికి ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. రాష్ట్రాన్ని మరో పులివెందుల చేద్దామనుకుంటున్నారా..?నా ప్రాణం ఉన్నంత వరకూ చూస్తూ ఊరుకొను. నా సెక్యూరిటీ విషయంలో కూడా జోక్యం చేసుకున్నారు. నాకు సరైన రక్షణ ఏర్పాట్లు కూడా చేయటం లేదు. ఎన్ఎస్జీ వాళ్లే నా భద్రత చూసుకుంటున్నారు అని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు ప్రకాశం చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పద్మ కుటుంబానికి రూ.7.65 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

ఏ ఆడబిడ్డకు జరగకూడదంటే ఏమి చేయాలి?

వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు ఒక చీకటి రోజు. టీడీపీ కార్యకర్త పద్మ చనిపోవడం.. చంపబడటం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తారు..?. ఇంట్లో ఉన్న మహిళను రోడ్డు పైకి ఈడ్చుకు వచ్చి తన్ని తన్ని చంపారు. ఆమెది ఆత్మహత్య కాదు.. ఒక ఆడబిడ్డ పట్ల వీరు అనుసరించిన తీరు అనాగరికం. ఆమెపై దాడి చేసిన తీరు దారుణం. ఇలాంటి తీరు ఏ ఆడబిడ్డకు జరగకూడదంటే ఏమి చేయాలి?. ముఖ్యమంత్రి మాట్లాడరు.. హోంమంత్రి ఇది మామూలు ఆత్మహత్య అంటారు. ఇది అమానవీయం...హేయం.. ఆమెను వివస్త్రను చేసి సెల్ ఫోన్‌లో చిత్రీకరణ చేయటం ఎంత దారుణం. పోలీసులు ఏమి చేస్తున్నారు.. కళ్ళ ముందు దోషులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..?. భర్త ముందే భార్యపై దాడి చేసి కారం కొట్టి చంపారు అని టీడీపీ అధినేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నింటితో పోరాడాను..!

పద్మ చనిపోయింది కాబట్టి చెబుతున్నాం... ఆమె బ్రతికి ఉంటే చెప్పుకునే వాళ్ళమా...? చెప్పుకోలేని ఆడబిడ్డలు ఎంత మందు పోలీసులు మీ తీరు మార్చుకోవాలి. ఎప్పుడు ఒకే ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వంలో మేము ఎప్పుడు అలా చేయలేదు. ఆమె తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటమే ఆమె చేసిన తప్పా..?. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. పద్మకు జరిగిన అవమానంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. డీజీపీ దగ్గరకు వెళ్లి మెమోరాండం ఇస్తే ఎగతాళి చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 40 రోజులయ్యింది.. చేయాల్సిన పనులు చేయాలి కానీ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. పోలీసులు ఆలోచించాలి.. ప్రజలు తిరగపడితే మీరు ఏమి చేయలేరు. అన్నింటితో పోరాడాను. ఇప్పుడు ఒక ప్రభుత్వం పోరాడుతున్నా. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తాను అని చంద్రబాబు ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. అయితే టీడీపీ అధినేత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.