ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చంద్రబాబు ఏమన్నారంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడైన సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీనే అధికారంలోకి వస్తుందని లగడపాటి సర్వే, ఎలైట్ సర్వేతో మరికొన్ని సర్వేలు తేల్చేశాయి. అయితే జాతీయ మీడియా సంస్థలన్నీ ఏపీలో వైసీపీనే విజయదుందుభి మోగిస్తుందని తేల్చి చెప్పేశాయి. దీంతో అటు జాతీయ మీడియా సర్వేలను నమ్మోలో..? ప్రాంతీయ మీడియా సర్వేలను నమ్మాలో తెలుగు ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.
టెక్నాలజీకి బానిసగా మారొద్దు!
ఏపీలో నూటికి నూరు కాదు.. వెయ్యిశాతం టీడీపీదే గెలుపు అని.. కార్యకర్తలు, నేతలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. గెలిచేది టీడీపీనేనని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మరోసారి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏప్రిల్-11న తాను ఒకే ఒక్క పిలుపిస్తే ప్రజలు.. వరదలా వచ్చి ఓటేశారని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. సర్వేలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిందని.. టీడీపీ గత 35 ఏళ్లుగా సర్వేలు చేస్తోందని బాబు గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమమే టీడీపీని గెలిపిస్తాయని బాబు ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదని.. ఇందులో ఒక్కశాతం కూడా అనుమానం లేదన్నారు. వందశాతం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. టెక్నాలజీకి బానిసగా మారొద్దని.. బలిపశువులు కావొద్దని చంద్రబాబు చెప్పడం గమనార్హం. టెక్నాలజీని కనుగొన్నది తానేనని.. దాన్ని ఈ స్థాయికి తెచ్చింది తానేనని చెప్పుకునే చంద్రబాబు బానిసగా మారొద్దని చెప్పడంతో జనాలు, విశ్లేషకులు, సొంత పార్టీ నేతలు కంగుతిన్నట్లు తెలుస్తోంది.
అధికారంలో ఉన్నా పోరాడుతున్నాం!
ఎన్నికల్లో పారదర్శకత ఉండాలని.. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి అభ్యంతరమేంటని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. బ్యాలెట్ తీసుకురాలేమని చెప్పి వీవీ ప్యాట్స్ తెచ్చారన్నారు. అధికారంలో ఉన్నా కూడా ఈవీఎంలపై పోరాడుతున్నామని బాబు చెప్పారు. అంతకుముందు ఎవరికి ఓటేశామో తెలియకుండా ఓటేశారని.. వీవీ ప్యాట్స్ పైనా తన డిమాండ్‌ను అందరూ ఒప్పుకుంటున్నారని.. ఆఖరికి మాజీ సీఈసీ ఖురేషీ కూడా తన అభిప్రాయాన్ని సమర్థించారన్న విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. వీవీ ప్యాట్స్ స్లిప్పులను బాక్సులో వేసి లెక్కించేందుకు ఇబ్బంది ఏంటి..? వేగం కంటే విశ్వసనీయతే ముఖ్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈసీ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితికి వచ్చిందని.. విశ్వసనీయత పెంచుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. మోదీ కేదార్‌నాథ్‌లో మెడిటేషన్ చేస్తే ఈసీ ఎందుకు పట్టించుకోలేదు? అని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు.
బాబు ఆదివారం ఏమన్నారో ఓ లుక్కేయండి!
"ఎగ్జిట్ పోల్స్ పదే పదే ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అసత్యమయ్యాయని అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయి.
ఎలాంటి అనుమానం లేదు.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుంది. ఇదే సమయంలో బీజేపీయేతర పార్టీలకు స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది.కేంద్రంలో బీజేపేతర ప్రభుత్వం ఏర్పడుతుంది.కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరొకసారి కోరుతున్నాం.. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వరకు వీవీ ప్యాట్లు లెక్కించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికంటే ముందే 5 వీవీ ప్యాడ్ స్లిప్పులను లెక్కించాలి. ఈవీఎంల లెక్కింపు.. వీవీ ప్యాట్ల లెక్కింపు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వీవీ ప్యాట్లను లెక్కించాలి" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
సో.. ఇప్పటి వరకూ వెల్లడైన ఎగ్జిట్స్ పోల్స్ సర్వేలు కొన్ని టీడీపీకి రాగా.. ఎక్కువ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు వైసీపీ వైపే మొగ్గు చూపాయి. ఇక మిగిలింది అసలు ఫలితాలు మాత్రమే. ఆ ఫలితాలు రావాలంటే మరో రెండ్రోజులు అనగా మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com