అస్మదీయుల కోసం అడ్డగోలు జీవోలు.. బాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం..
- IndiaGlitz, [Saturday,November 25 2023]
రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా టీడీపీ అధినేత చంద్రబాబు మాయలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తిమ్మిని బమ్మిని చేయడంలో ఆయనని మించిన దిట్ట ఎవరు ఉండరని జగమెరిగిన సత్యం. పైకి చెప్పేది ఒకటి.. లోపల చేసేది ఇంకొకటి.. కేబినెట్ ముందు పెట్టే ప్రతిపాదనలు ఒకటి.. అవి ఆమోదం పొందిన తరువాత జరిగే తంతు మరొకటి. తమకు నచ్చిన పత్రాలు కలిపేసి ఆ మొత్తాన్ని కేబినెట్ ఆమోదించినట్లు జనాన్ని నమ్మించి కోట్లు కొట్టేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ఎవరైనా అడిగితె అదేం లేదు.. ఇదంతా కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని బుకాయింపు చేయడం బాబుకే చెల్లుబాటు అవుతుంది.
టీడీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా... కేబినెట్‌కు తెలియకుండా... అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించారు. అందుకోసం 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8శాతం + జీఎస్టీ, బార్లపై ఉన్న 9శాతం + జీఎస్టీ ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్ల మేర గండి కొట్టారు. అందుకు మార్గం సుగమం చేస్తూ సంబంధిత నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేసినట్టు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి.
కేబినెట్ ఆమోదం లేదు..
వాస్తవానికి 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. అందుకు కేబినెట్ సమావేశం ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని ప్రతిపాదించారు. కానీ ఆ ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ దృష్టికే తీసుకువెళ్ల లేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015, జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేసింది. కానీ ఆ రెండు జీవోల్లో మద్యం దుకాణాల(ఏ4 షాపులు)కు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్టు కనీసం పేర్కొనలేదు. కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోట్ పంపుతారు. అందులో మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టంలోని 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేస్తారు. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపుతూ ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
అంటే ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు పూర్తిగా తెలుసు అని అర్థమవుతోంది. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్న విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు రామోజీరావు వంటి వారు అడ్డగోలుగా వాదిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇక చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం అదే రోజు అంటే 2015, జూన్ 22 సాయంత్రం జీవో 218 జారీ చేసింది. కేబినెట్‌లో చర్చించి జీవోలు 216, 217 జారీ చేశారు. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్నట్టు జారీ చేసిన జీవో 218 గురించి కేబినెట్‌లో చర్చించలేదు.
బార్ల కేటాయింపులోనూ అదే బరితెగింపు..
మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి అస్మదీయులకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన చంద్రబాబు తమ సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. అందుకోసం చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్ చట్టంలోని 10(ఏ) నిబంధనను తొలగించాలని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015, సెప్టెంబరు 1న ప్రభుత్వానికి ఓ సర్కుల్యర్ పంపారు. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు కనికట్టు చేశారు. ఇందుకోసం 2015, సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఓ వినతిపత్రం సమర్పించినట్టు రికార్డుల్లో చూపించడం గమనార్హం. సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే... అంతకు ముందు అంటే సెప్టెంబరు 1నే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి సర్క్యూలర్ ఎలా పంపారన్నది చంద్రబాబే సమాధానం చెప్పాలి.
ఈ క్రమంలో ఏకపక్షంగా బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015,డిసెంబర్ 3న, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015, డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం గమనార్హం. కానీ అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు రామోజీరావు వితండవాదం చేస్తుండటం ఎల్లో గ్యాంగ్ కుట్ర రాజకీయాలకు నిదర్శనం. మొత్తమ్మీద చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు గండి పడిందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తప్పుబట్టారు. మొత్తానికి చూసుకుంటే చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది.