Chandrababu: సీఎం జగన్.. అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు: చంద్రబాబు
- IndiaGlitz, [Monday,February 05 2024]
సీఎం జగన్ అర్జునుడు కాదని.. అక్రమార్జునుడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి, అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన 'రా..కదలిరా' బహిరంగసభల్లో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ధ్వజమెత్తారు. నిండు సభలో తన భార్యను ఘోరంగా అవమానించారని వాపోయారు. ఎప్పుడూ రోడ్డు మీదకి రాని తన భార్యను అవమానించడంతో తీవ్ర ఆవేదన చెందానని చెప్పుకొచ్చారు. జగన్ రాష్ట్రంలో ఎవరిని వదలేదని.. చివరకు తన సొంత తల్లి, చెల్లిని కూడా వదలలేదని మండిపడ్డారు. అందుకే రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమని ఈ ఎన్నికల్లో సైకో జగన్ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బటన్‌లు నొక్కుతున్నానని జగన్ గొప్పులు చెప్పుకొంటున్నారని.. 'బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి.?'అని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని గుర్తు చేశారు. జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్రలోని ఒక్కో కుటుంబం రూ.8లక్షలు నష్టపోయిందన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు.? అని నిలదీశారు. జగన్‌ది ఉత్తుత్తి బటన్ నొక్కుడని.. జాబు కావాలంటే బాబు రావాల్సిందే అని పునరుద్ఘాటించారు.
జగన్ బటన్ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని.. ఎన్నికల్లో ప్రజలంతా ఒకే బటన్ నొక్కుతారని..ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయమన్నారు. మైనింగ్ బటన్ నొక్కి భూగర్భ సంపద దోచేశారని.. ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి సంపద తరలించారని.. ధన దాహంతో జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రుషికొండను అనకొండలా మింగేశారని.. విశాఖలో రూ.40వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రూ.500 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని.. సలహాదారులకే రూ.680 కోట్లు దోచిపెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖను గంజాయి కేంద్రంగా.. క్రైమ్ సిటీగా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు. ఇక జగన్‌ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ఆయన్ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు.
అంతకుముందు చింతలపూడిలో చంద్రబాబు హెలికాఫ్టర్ ఆగే హెలీప్యాడ్ వద్ద తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సిగ్నల్ బజర్ మోగడంతో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాల్లో ఇనుప ముక్క బయటపడడంతో అధికారులు, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని పోలీసులు సూచించారు. చింతలపూడి సభ వద్ద హెలీప్యాడ్‌పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు తొలుత అధికారులు అనుమతి నిరాకరించారు.