రూల్స్ బ్రేక్ చేయడంలో చంద్రబాబే నంబర్ వన్
- IndiaGlitz, [Tuesday,October 31 2023]
అనారోగ్యంగా ఉందన్నారు.. కళ్లు కనపడడం లేదన్నారు.. చర్మ సమస్యలు అన్నారు.. కనుక మీ ఆరోగ్య పరిస్థితిని గమనించి.. మీకు కంటి చికిత్స అవసరాన్ని గుర్తించి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ నెల రోజులు బుద్ధిగా ఉండండి.. ర్యాలీలు చేయకండి.. మైక్ కనిపించగానే ఇష్టానుసారం వాగొద్దు.. మీడియాతో మాట్లాడొద్దు.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దు.. నెల కాగానే మళ్లీ జైలులో లొంగిపోవాలి అంటూ పలు షరతులు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు ఈరోజే యథేఛ్చగా ఉల్లంఘించారు.
వ్యవస్ధ సృష్టించిందే నేను.. వ్యవస్థలను నడిపేదే నేను అనుకుంటున్నారో ఏమో కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగానే యాభై రోజులుగా మైక్ దొరకక ఆవురావురుమంటున్న చంద్రబాబు వెంటనే స్వోత్కర్ష మొదలుపెట్టేశారు. నేను నిప్పును.. తుప్పును.. తప్పు చేయను.. చేయనివ్వను అంటూ తన ఘనతను చెప్పుకుంటూ పోయారు. అంతేకాకుండా తానూ జైల్లో ఉన్నపుడు మద్దతు ప్రకటించిన జనసేన పవన్ కళ్యాణ్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్‌లోని కొందరు నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు విధించిన నిబంధనలు అయన ఒక్క రోజులోనే ఉల్లంఘించి తన తీరు ఇంతేనని మరోసారి చాటిచెప్పారు. తనను ఎవరేమి చేస్తారనే ధీమాతోనే అయన ఇలా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక బయట ఉండే ఈ నెలరోజుల్లో ఇంకెన్ని విధాలుగా తన దూకుడును బయటపెట్టి కోర్టులను, వాటి తీర్పులను అవహేళన చేస్తారో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అనారోగ్యం కారణంగా షరతులతో కూడిన బెయిల్‌తో బయట ఉన్న చంద్రబాబు ఇంకెన్ని రూల్స్ ఉల్లంఘిస్తారోనని ప్రశ్నిస్తున్నారు.