Pawan Kalyan:పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి తొలిసారి కలిశారు. ఈ భేటీలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత జనసేనాని ఇంటికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుమారు రెండున్నర గంటల పాటు వీరి మధ్య భేటీ జరగడం విశేషం. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న టీడీపీ-జనసేన సీట్ల విషయంలో ఈ సమావేశంలో ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజాభిప్రాయం మేరకే సీట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్‌తో చర్చించి ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయిస్తామన్నారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్‌తో సమావేశమై చర్చించారు. సంక్రాంతి పండుగ లోపు మరో రెండు, మూడు సార్లు సమావేశమై సీట్ల అంశంలో ఓ కొలిక్కి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ను నెలకొల్పేందుకు ఉమ్మడిగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు చేశారు.
సమావేశం అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్టాడుతూ "ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది. అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి..? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నాం. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారు. వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగింది. అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతాం" అని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments