టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు పిలుపు.. ఏం చేయబోతున్నారో!

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు మొదలుకుని నేటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున అటు ఈసీ.. ఇటు కేంద్రం.. మధ్యలో కేసీఆర్, వైఎస్‌ జగన్‌పై యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. అసలు ఏప్రిల్-11 జరిగిన ఎన్నికలు ఎన్నికలే కావని స్వయానా చంద్రబాబు అనడంతో ఆయనేంటి ఇలా అనేశారని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ తరుణంలో ఈనెల 22న టీడీపీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరూ అమరావతికి రావాలని పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశాని ఎవరూ గైర్హాజరు కాకుండా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చంద్రబాబు సూచించారు.

గురువారం టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అందర్నీ అమరావతికి పిలిపించుకుని మాట్లాడాలని నిర్ణయించారు. 22న జరగనున్న ఈ సమావేశంలో పోలింగ్ ఎలా జరిగింది..? పోలింగ్ రోజున అభ్యర్థులకు ఎదురైన సంఘటనలు ఇలా వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మళ్లీ టీడీపీ వస్తే పరిస్థితి ఏంటి..? ఒకవేళ వైసీపీ వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది..? అనే విషయాలపై నిశితంగా చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అభ్యర్థులు అభిప్రాయలను కూడా బాబు అడిగి తెలుసుకోనున్నారట.

కాగా.. ఇప్పటికే చంద్రబాబుతో పాటు పలువురు అభ్యర్థులు ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు చేసిన విషయం విదితమే. మొత్తానికి చూస్తే ఈనెల 22 తర్వాత చంద్రబాబు అసలేం చేయబోతున్నారనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు వైసీపీ మాత్రం బాబుకు ఓటమి తప్పదనే ఇంత హడావుడి చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసలు 22న బాబు ఏం చేయబోతున్నారో.. మున్ముంథు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.