Lokesh:చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు: లోకేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
నెల రోజులుకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీ బాధపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. జైలులో అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. దీని వల్ల ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చంద్రబాబు ఐదు కేజీల బరువు తగ్గారు..
చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం , వయసు రీత్య సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికే ఆయన ఐదు కిలోల బరువు తగ్గారని... ఇలా బరువు తగ్గుతూ పోతే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వాపోయారు. జైలులో నీళ్లు సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ సరిగా శుభ్రం చేయడం లేదని కూడా విమర్శించారు. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణం వల్ల తన భర్త ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరం..
అటు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయ విదారకరమని వాపోయారు. ఇలాంటి వాతావరణం చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరమని కోరారు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గడం ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని బ్రహ్మణి ట్వీట్ చేశారు.
చంద్రబాబుకు ఏమైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత..
మరోవైపు టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు ఏసీ అవసరమని.. వేడి ఉష్ణోగ్రతను ఆయన తట్టుకోలేక పోతున్నారని వాపోయారు. జైల్లో చంద్రబాబుకు ఇతర మందులు ఇస్తూ ప్రాణానికి హాని తలపెడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు ఏమైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఘాటు స్వరంతో హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి స్వయంగా జగన్ ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout