Chandrababu:జిల్లాల పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..
- IndiaGlitz, [Saturday,December 02 2023]
టీడీపీ అధినేత చంద్రబాబు ఇక పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తొలిసారి శుక్రవారం తిరుమల శ్రీవారిని సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి చేసుకున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం సింహాచలం అప్పన్న, మంగళవారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు.
దేవాలయాల సందర్శన పూర్తైన వెంటనే పూర్తిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరగనున్నాయి. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను సమావేశాలకు ఆహ్వానించనున్నారు. ఒక్కో సమావేశానికి సుమారు ఐదారు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఢిల్లీ వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. దొంగ ఓట్లు చేర్పించటం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేయటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ లోపు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయనున్నారు. శుక్రవారం ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నాగార్జున సాగర్ ఘటనపై చర్చించారు. సాగర్ డ్యాం వద్ద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టించటం తప్ప వైసీపీ ప్రభుత్వం సాధించేది ఏమిటని నిలదీశారు. కుటిల రాజకీయాలతో రాష్ట్రం పరువు తీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.