Chandrababu:బీజేపీకి భయపడిన చంద్రబాబు.. ప్లేటు ఫిరాయింపు..
- IndiaGlitz, [Thursday,December 07 2023]
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్ విజయానికి సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతల ప్రచారాల్లో టీడీపీ కార్యకర్తలు పసుపు జెండాలతో భారీగా పాల్గొన్నారు. అలాగే ఫలితాల వెల్లడి రోజు రేవంత్ రెడ్డి ఇంటి వద్దతో పాటు గాంధీభవన్‌లో పసుపు జెండాలు పెద్ద ఎత్తున కనిపించాయి. జై బాబు.. జైజై బాబు నినాదాలు కూడా చేశారు. దీంతో కాంగ్రెస్ నేతల గెలుపునకు టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా తన వంతు ప్రయత్నాలు చేశారని స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడొద్దు..
ఇంతవరకు బాగానే ఉన్నా నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మిగిలిన మూడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు భయపడినట్లు తెలుస్తోంది. ఫలితాలు తారుమారు కావడంతో వెంటనే ప్లేట్ ఫిరాయించిన చంద్రబాబు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ క్యాడర్ ఎక్కడా నోరు విప్పి కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడొద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు.
15 సీట్లు కూడా ఇచ్చేది లేదు..
ఇదిలా ఉంటే ఏపీలో జనసేనతో పొత్తు విషయంలోనూ చంద్రబాబు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ ములాఖత్ అయినప్పుడు పొత్తు పెట్టుకుంటే 50 సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చేశారని తెలుస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్లు అంశంపై ప్రధాన చర్చ జరిగిందని.. 15 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని బాబు చెప్పినట్లు సమాచారం.