YCP MLA:టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. ఆహ్వానించిన చంద్రబాబు..
- IndiaGlitz, [Saturday,March 02 2024]
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గం వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. అనంతరం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు తిరిగి సీఎం కావాలనే ఆకాంక్షతోనే టీడీపీలో చేరానని తెలిపారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టంచేశారు. వైసీపీలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఉండదని.. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు.
కాగా మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ బరిలో నిలిచే అవకాశం ఉంది. కృష్ణప్రసాద్ చేరికతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెరగనుంది. అయితే ప్రస్తుతం మైలవరం తెలుగుదేశం ఇంఛార్జీగా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేనితో మాట్లాడిన చంద్రబాబు, లోకేష్.. ఆయనకు పెనమలూరు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ఆయన కూడా సుముఖతం వ్యక్తం చేశారు. మరోవైపు వసంత కూడా దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇరువురు నేతలు పార్టీ బలోపేతం కృషి చేయనున్నారు.
మరోవైపు వైసీపీకి చెందిన మరో ఇద్దరు కీలక ఎంపీలు సైతం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులో జరిగే రా..కదిలిరా సభలో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు వందలాది మంది కీలక నేతలు టీడీపీలో తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం పల్నాడు జిల్లా గురజాలలో జరగనున్న రా..కదలిరా బహిరంగ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవారాయులు(Lavu Srikrishnadevarayulu) పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సైతం పార్టీలో చేరే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికల వేళ వైపీపీలోని ప్రముఖ నేతలందరూ టీడీపీ వైపు మొగ్గు చూపడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది.