Chandrababu:అయోధ్యకు చంద్రబాబు.. బీజేపీతో సఖ్యత కుదిరినట్లేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
దేశమంతా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసమే వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. శతాబ్దాలుగా కలలు కంటున్న ఆ అద్భుతమైన క్షణం చూసేందుకు ఉవిళ్లూరుతోంది. అందుకే ఇప్పుడు దేశ మొత్తం రామ జపం జపిస్తోంది. మన దేశమే కాకుండా విదేశాల్లో ఉన్న రామభక్తులు కూడా ఈ చారిత్రాత్మకమైన ఘట్టం తిలకించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అయోధ్యలో సంప్రదాయ కృతువులు ప్రారంభం అయ్యాయి. అయోధ్య నగరమంతా సీతారాముని బొమ్మలతో నిండిపోయింది. రాముడి దివ్యరూపంతో డ్రోన్‌షో కూడా ఏర్పాటు చేశారు. మూడంటే మూడే రోజుల్లో రాములోరు మందిరంలోకి కొలువుదీరబోతున్నారు. ఇప్పటికే 'రామ్ లల్లా' విగ్రహం కూడా ఇందుకు సిద్ధమైంది.
అయోధ్యకు రావాలని ఆహ్వానం..
ఆ రాములోరి దివ్యదర్శనం చేసుకునేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు అయోధ్య బాట పట్టారు. ఇక దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 7వేల మంది ప్రముఖులకు రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం అందించింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఇటీవల ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానపత్రిక అందజేశారు. దీంతో వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. జనవరి 21 సాయంత్రం హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లనున్నారు. 22న జరిగే రామమందిరం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.
గతంలో మోదీతో ఢీ అంటే ఢీ..
ఇంత వరకు బాగానే ఉన్నా.. కొంతకాలంగా బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సఖ్యతగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానపత్రిక అందించడం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ప్రధాని మోదీతో ఢీ అంటే ఢీ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ అనేక నిరసన కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దీనిపై వాడివేడి చర్చ కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
రాజీ కోసం తీవ్ర ప్రయత్నాలు..
ప్రధాని మోదీతో విభేదాలు పెట్టుకుని పొరపాటు చేశానని తెలుసుకున్న చంద్రబాబు..దానికి విరుగుడు రాజకీయం మొదలుపెట్టారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించారని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి మోదీతో స్నేహ హస్తం కోసం బాబు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా మోదీని పొగుడుతూ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే ఎన్నికల సమయంలో ఉపయోగడుతుందని భావిస్తున్నారు. కానీ కేంద్ర పెద్దలు సుముఖత వ్యక్తం చేయలేదు.
టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్..!
కానీ రాష్ట్రంలో మారిన పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం అయిపోగానే పొత్తులపై అధికారికంగా ప్రకటించే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును చారిత్రాత్మకమైన కార్యక్రమానికి ఆహ్వానించారనే అభిప్రాయాలు వస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు వంద శాతం ఉన్నాయంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments