5 కోట్ల మంది చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మరో సింగపూర్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తానని.. రాజధాని అంటే ఇలా ఉండాలని అందరూ అనుకోవాలని.. ఎవరూ కనివినీ ఎరుగని రీతిలో క్యాపిటల్ కడతానని టీడీపీ అధినేత, 2014లో సీఎం అయిన నారా చంద్రబాబు కోట్లిచ్చి డిజైన్లు గీయించిన ఆంధ్రాలోని ఐదు కోట్ల మంది ప్రజలకు తెలిసే ఉంటుంది. అంతేకాదు శాశ్వతంగా చేసిందేమీ లేదుకానీ తాత్కాలికం అంటూ భవనాలు నిర్మించిన సంగతీ తెలిసే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులు ఉత్తరాంధ్ర, ఒడిషా, కేరళ, కోల్‌కతాను భయాందోళనకు గురిచేస్తున్న ‘ఫొనీ’తుఫాను ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో కోట్లల్లో నష్టం వాటిల్లగా.. ప్రాణ నష్టం కూడా జరిగింది.
అమరావతి అస్తవ్యస్తం..!
ఇక అసలు విషయానికొస్తే.. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల థాటికి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలైన కొన్ని భవనాలు, కరెంట్ పోల్‌లు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో భయభ్రాంతులకు ఉద్యోగులు, సందర్శకులు గురయ్యారు. రూ.25 లక్షల వెచ్చించి నిర్మించిన స్మార్ట్‌పోల్ కుప్పకూలింది. గాలికి సచివాలయంలోని బ్లాకులపై రేకులు ఎగిరిపోయాయి. మరోవైపు పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు ధ్వంసమయ్యాయి.
నిర్మాణ దశలో ఉన్నభవనాల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే నేలపాడులోని తాత్కాలిక హైకోర్టు వద్దా అదే పరిస్థితి. కృష్ణా జిల్లాలో చెట్టు కూలి ఒకరు, గుంటూరు జిల్లాలో పిడుగు పడి మరొకరు మృతి చెందారు. కాగా.. అమరావతి అస్తవ్యస్తం అవడంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుపై ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, పలువురు ప్రముఖులు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ!?
ట్విట్టర్ వేదికగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. "తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ?. 2003లో ముందస్తు ఎన్నికలకు వెళ్దామని పోరు పెట్టి వాజ్‌పేయి ప్రభుత్వాన్ని 6 నెలల ముందే దిగిపోయేట్టు చేశారు. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీంలో 21 పార్టీలతో రివ్యూ పిటిషన్ వేయించి వాళ్ల పరువు తీశారు. మీ మేనిప్యులేషన్లకు కాలం చెల్లింది చంద్రబాబూ" అని విమర్శలు గుప్పించారు.
ఆడలేక మద్దెల ఓడు అనడటమే..
"వీవీప్యాట్లను ఎలక్షన్ కమిషన్ 2014లో ప్రయోగాత్మకంగా 8 లోక్‌సభ స్థానాల్లో ఏర్పాటు చేసింది. ఈసారి దేశవ్యాప్తంగా పెట్టింది. ఈవీఎంలకు ఇది అదనంగా అమర్చిన ఏర్పాటే తప్ప కౌంటింగ్ కోసం కాదని ఈసీ చెబుతోంది. అయినా కొన్నిటిని లెక్కిస్తామని చెప్పినా రాద్దాంతం చేయడం, ఆడలేక మద్దెల ఓడు అనడటమే. కాఫర్ డ్యాం ద్వారా పోలవరం కాలువలకు నీళ్లివ్వగలిగితే మొత్తం ప్రాజెక్టు కట్టేదెందుకు? బ్యారేజి కడితే సరిపోతుంది. ప్రధాన డ్యాం కాంక్రీట్ పనులకు అంతరాయం లేకుండా కాఫర్ డ్యాం అనే తాత్కాలిక నిర్మాణం ద్వారా నీటిని మళ్లిస్తారు. అయినా పచ్చ మీడియా చూపిస్తుంది కాబట్టి బాబు చెబ్తూనే ఉంటారు" అని విజయసాయిరెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. అయితే విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ నేతలు, ముఖ్యంగా చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 8, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments