ఎన్నికల ముందు అసంతృప్తితో రగిలిపోతున్న చంద్రబాబు!
- IndiaGlitz, [Monday,February 25 2019]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. మంత్రులు, తెలుగు తమ్ముళ్ల చేష్టలే సీఎం అసంతృప్తికి కారణమయ్యాయ్. అసలేం జరిగింది..? చంద్రబాబు ఎందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
సోమవారం సాయంత్రం ఏపీ సీఎం కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు గంటన్నరపాటు జరిగింది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? ప్రతిపక్షాన్ని ఎలా ఢీ కొనాలనే విషయం నిశితంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు, తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి లోనయ్యారు. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన అసంతృప్తికి వ్యక్తం చేశారు. దేనికైనా సరే ‘నేనొక్కడినే’ సమాధానం చెబుతున్నాను. మంత్రులెవరు పట్టించుకోలేదు. మన వాదన తప్ప .. ప్రతిపక్ష పార్టీల వాదనే ప్రజల్లోకి వెళ్తోంది అని మంత్రుల ముందు చంద్రబాబు అసంతృప్తికి లోనయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. జాతీయ స్థాయిలో ముందస్తుగానే కూటమి ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని బాబు ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తు కూటమి ఏర్పాటు చేయాల్సి ఉందని బాబు ఈ సందర్భంగా మంత్రులతో అన్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు.