క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్
- IndiaGlitz, [Tuesday,January 16 2024]
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును ఇచ్చింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను సమర్థించడం చంద్రబాబుకు గట్టి చెంపపెట్టు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో రిమాండ్ విధించే అధికారం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు ఉందని తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబుకు ఇది రిలీఫ్ కాదని.. విచారణ ఇంకా పూర్తి కాలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
17ఏ వర్తిస్తుంది..
ఈ కేసును చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయడం గమనించదగ్గ విషయం అంటున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది.. ఈ కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ కేసులో అరెస్టుకు వర్తింపజేయరాదు. అయినా ఆయనకు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఆర్టర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదుఅని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు.
17ఏ వర్తించదు..
ఇక ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏ నిబంధనను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. రిమాండ్ విధించడం కూడా సబబే అని తెలిపారు.
రిమాండ్ సబబే..
మొత్తానికి 17ఏ నిబంధన వర్తింపు విషయంలో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు విభిన్న తీర్పులు ఇవ్వడం.. అందులోనూ రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు తీర్పును సమర్థించడం చూస్తుంటే చంద్రబాబుకు ఈ కేసులో పెద్ద దెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు.
జైలులో 52రోజులు..
కాగా ఈ కేసులో గతేడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 52రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది అక్టోబర్ 18న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెల్లవరించింది.