కేసీఆర్.. ఏం చేసుకుంటావో చేస్కో..: చంద్రబాబు
- IndiaGlitz, [Thursday,March 07 2019]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘డేటా చోరీ’ వివాదం కాస్త చంద్రబాబు వర్సెస్ కేసీఆర్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై ఒక్కసారి కూడా కేసీఆర్ స్పందించకపోగా.. మొత్తం కేసీఆర్, కేటీఆరే చేస్తున్నారంటూ చంద్రబాబు ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ ఇస్తానన్న ‘రిటర్న్ గిఫ్ట్’ వ్యవహారం చంద్రబాబుకు గుర్తొచ్చింది. పనిలో పనిగా ప్రెస్‌మీట్‌లో అవకాశం దొరికింది కదా అని అన్నీ కలిపికొట్టేశారు.
ఏం చేసుకుంటావో చేస్కో కేసీఆర్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేలు పెట్టాడని తాము కూడా ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకో అడుగు ముందుకేసిన సీఎం కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని.. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని కచ్చితంగా ఇచ్చితీరుతానని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా చంద్రబాబు స్పందిస్తూ.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో.. రాజకీయంగా ఏం చేస్తారో చేసుకోండంటూ సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ను దొంగదారిన దెబ్బతీస్తానంటే సహించే పరిస్థితే లేదన్నారు.
కేసీఆర్ గురించి ఇంకా ఏమన్నారంటే..
అందరికీ డబుల్ బెడ్ రూమ్‌ల కట్టిస్తానని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టారో చెప్పాలన్నారు. తెలంగాణలో ఎన్ని భోజన క్యాంటీన్లు ఉన్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌ను ఆయన ప్రశ్నించారు. కేసీఆర్... ఏపీలో అన్న క్యాంటీన్లను ఎలా కట్టామో చూడు.. అని ఆయనకు సూచించారు. మా పథకాలకు ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తుండటంతో ఎలా దెబ్బతీయాలా అని కేసీఆర్ అండ్ జగన్ ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే... రాష్ట్రం కేసీఆర్‌కు సామంతరాజ్యం అవుతుందని చంద్రబాబు జోస్యం చెప్పుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రాణాలైనా ఇస్తానని అన్నారు.
డేటా సేకరిస్తే తప్పు కాదు..!
తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఏపీలో కూడా అనుసరిస్తారా..? కార్యకర్తలు డేటా సేకరిస్తే తప్పు ఏంటి? ఒక ప్రైవేటు కంపెనీ డేటాను ఏ చట్ట ప్రకారం తీసుకుంటారు? ఓట్లను చెక్ చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జగన్‌కు హైదరాబాద్‌లో ప్రభుత్వం సహకరిస్తోంది. అక్కడి ఆర్థిక మూలాలను ఉపయోగించుకొని కేసులు పెడతున్నారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్థిక ఉగ్రవాదుల్లా పనిచేస్తున్నారు. ఇటువంటి దాడులపై పోరాడుతాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నాం. అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాం. రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీనే. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తాం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అసలే ఫుల్‌కాక.. మీద ఉన్న సీఎం కేసీఆర్‌పై ఈ డేటా వ్యవహారం మొదలుకుని నేటి వరకూ రోజు ఆయనపై వివాదాస్పద ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను, విమర్శలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పందించి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌తో తెలుగు తమ్ముళ్లంందరికీ కేటీఆర్ ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నా అంటూ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలే చేశారు. అయితే ఈ డేటా వ్యవహారం విమర్శలు కాస్త కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా మారిపోయింది. మొత్తానికి చూస్తే రెండ్రోజుల్లో సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వస్తారని.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే చంద్రబాబు మాట్లాడిన మాటలకు గాను కేసీఆర్ కౌంటర్ల వర్షం కురిపిస్తారని తెలుస్తోంది.