KCR:నాడు చంద్రబాబు మోసం చేశారు.. అందుకే ఉద్యమానికి శ్రీకారం చుట్టా: కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
నాడు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచనని చెప్పి.. తర్వాత పెంచి మోసం చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక లాభం లేదనుకుని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో మేడ్చల్ తూంకుంటలోని కన్వెన్షన్ హాలులో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్ రావు, ఒంటేరు ప్రతాపరెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కొంతమందితో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ముందుకు వచ్చానని.. తనతో ఎవరూ కలిసి రాలేదన్నారు. చివరికి తెలంగాణ సాధించుకున్నామన్నారు.
ఒక్కణ్ణే బయలుదేరా.. తెలంగాణ సాధించా..
24 ఏళ్ల క్రితం ఒక్కణ్ణే బయల్దేరా.. ఆనాడు కొంతమంది మిత్రులం కూర్చుని మన బతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్లమని తెలిపారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి.. ఎక్కడ చూసినా చిమ్మ చీకటి అలుముకుందన్నారు. ఎవరిని కదిలించినా మన బతుకులు ఏం ఉన్నాయి? అనే ఆవేదన ఉండేదన్నారు. ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బిందెలతో ప్రదర్శనలు ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి లేదన్నారు. మహబూబ్ నగర్‌తో పాటు మెదక్ జిల్లాలోనూ వలసలు ఎక్కవగా ఉండేవని.. వ్యవసాయ స్థిరీకరణ జరిగితే కానీ పరిస్థితి మారదని ఆలోచించా అన్నారు. ఇప్పుడు వలసలు ఆగిపోయి వ్యవసాయ రంగం పురోగమించి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు.
95 నుంచి 105 స్థానాలు వస్తాయని జోస్యం..
ఇక నుంచి గజ్వేల్ నియోజకవర్గానికి నెలకు ఓ రోజు కేటాయిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆగకూడదు అంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని.. కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఈసారి కేసీఆర్ తొలిసారి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. దీంతో గజ్వేల్‌లో ఓడిపోతారని తెలిసే మరో నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గజ్వేల్ నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments