Chandrababu, Pawan Kalyan:నేడే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Wednesday,December 20 2023]
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవతంగా ముగిసిన సందర్భంగా 'యువగళం-నవశకం' బహిరంగ సభ నేడు జరగనుంది. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగే ఈ సభకు టీడీపీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. ఎన్నికలకు మూడు నెలల ముందు జరగనున్న సభ కావడంతో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటుచేసింది.
110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 100 అడుగల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవ్వనున్నారు. సభ ఎదురు వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు, విశాఖ వైపు నుంచి వచ్చే వాహనాలకు వేరు వేరు పార్కింగ్‌లు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. ఈ బహిరంగ సభ ఈ దశాబ్ధపు అతిపెద్ద వేడుక కానుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో సభ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత థోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. ఇక ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, కార్యాచరణను సభా వేదికగా ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్రమంతా ప్రజలు ఈ సభ కోసం ఎదురుచూస్తున్నారు.