భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్.. డ్యాన్స్ వేసిన మంత్రి అంబటి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను ముందుగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు తెల్లవారుజామునే నిద్రలేచి భోగిమంటలు వేశారు. ఇళ్లలోని పాత సామానులు మంటల్లో కాలుస్తూ కొత్త కాంతులు రావాలని కోరుకున్నారు. అలాగే ఏపీలోని పలు ప్రాంతాలత్లో అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు భోగి మంటల వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
గుంటూరు జిల్లా మందడంలో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు.
ఇక మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు. మహిళలతో నృత్యాలు చేసి అలరించారు. సంబరాల రాంబాబు పాటకు కూడా తనదైన శైలిలో స్టెప్పులు వేసి హావభావాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో తాను సంబరాల రాంబాబునే అన్నారు. తన స్టెప్పులు, పేర్లు సినిమాల్లో వాడుకున్నా ఇబ్బంది లేదని తెలిపారు.
మరో మంత్రి రోజా కూడా నగరిలో జరిగిన వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్ లోకల్ నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడకు వచ్చి ఏదో చెబితే ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే గెలుపని.. ప్రజలంతా జగనన్న వన్స్ మోర్ అంటున్నారని ఆమె వెల్లడించారు.
అలాగే ఇంకో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగిన భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ సొంతూళ్లకు వచ్చిన అత్యంత సందడి వాతావరణంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని తెలిపారు. అటు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో నిర్వహించిన భోగి వేడుకల్లో సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి సందడి చేశారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను సొంత వ్యక్తుల మధ్య జరుపుకోవం సంతోషంగా ఉందన్నారు. వీరితో పాటు మరికొంతమంది ప్రముఖులు భోగి వేడుకల్లో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments