Chandrababu and Pawan:అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. బీజేపీకి ఎన్ని సీట్లంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. ఈ భేటీలో టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో త్వరలో జరిగే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ హాజరుకానుంది. దాదాపు గంట పాటు వీరి భేటి కొనసాగింది. గురువారం అర్థరాత్రి అమిత్ షాతో ఓ విడత చర్చలు జరిపారు. కొన్ని సీట్ల విషయంలో స్పష్టత రాకపోవడంతో ఇవాళ మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల్లో పొత్తుతో పాటు సీట్లపై మూడు పార్టీలు అధికారిక ప్రకటన చేయనున్నాయి.
ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపురం, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం మూడింటిలో రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ సీటును బీజేపీకి ఇచ్చేందుకు పవన్ సిద్ధమయ్యారంటున్నారు .
వాస్తవంగా పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు చంద్రబాబు కేటాయించారు. అయితే ఇప్పుడు కూటమిలోకి బీజేపీ చేరడంతో ఓ సీటును జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యం పెట్టుకున్న కమలం పెద్దలు.. ఎంపీ సీట్లను ఎక్కువగా అడుగుతున్నారు. 10 ఎంపీ సీట్లు అడగారని.. అయితే 6 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రావడంతో త్వరలోనే పొత్తు అధికారికంగా ప్రకటించనున్నారు.
మరోవైపు జనసేనాని కూడా ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. తిరుపతి లేదా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా.. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయిని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారని పేర్కొంటున్నాయి. లోక్‌సభకు ఎన్నికైతే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సీఎం పదవితో సమానమైన కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పెండింగ్ సమస్యలను కేంద్రం నుంచి రాబట్టడానికి మంచి అవకాశాలు ఉంటాయని పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments