Jayaprakash Narayana:చంద్రబాబు, కేసీఆర్ హయాంలో ఇలా జరగలేదు.. జగన్ పాలనపై జేపీ కామెంట్స్..
- IndiaGlitz, [Tuesday,February 20 2024]
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైసీపీ ఐదేళ్ల పాలనపై జేపీ చేసిన వ్యాఖ్యలు పెద్దు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేపీ మాట్లాడుతూ జగన్ సర్కార్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ హయాంలో ప్రత్యర్థి తలకాయ తీసేయాలన్న పరిస్థితి లేదన్నారు. ఎక్కడో చోట గీత ఆ నేతలకు ఉంది. కానీ ప్రస్తుతం ఏపీలో ప్రస్తుత నేతలు కచ్చితంగా ఆ గీత దాటి వ్యవహరిస్తున్నారు. కనీస మర్యాద పాటించడం లేదంటూ వ్యాఖ్యానించారు.
’ఏపీలో నేతలు గీత దాటి వ్యవహరిస్తున్నారు. తుగ్లక్ రాజ్యం ఒక పక్కన. నువ్వు ఏం చేసినా అడ్డుకుంటా. బస్తీ మే సవాల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగమే రాజధానిని ఆపేయడం కావచ్చు. గ్రీన్ ఫీల్డ్ సిటీని ఆపేయడం కావచ్చు. పోలవరం ఆపేయడం కావచ్చు. ఎన్ని మాటలు చెప్పినా పోలవరం బ్రహ్మాండంగా జరగడం లేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వచ్చినా, రాకపోయనా.. బోడి వచ్చేది ఏంటి అన్న భావనలో ఇక్కడ నేతలు ఉన్నారంటూ జేపీ విమర్శించారు. ఇక్కడ ఒక గూండా రాజ్యం తెస్తున్నారన్న భావనను కలిగించారు అని జేపీ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇటీవల రాష్ట్రంలో వైసీపీ పాలన బాగుందంటూ ఆయన కితాబు ఇచ్చారు. విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్‌తో కలిసి జేపీ పాల్గొన్నారు. జగన్ పక్కనే కూర్చోవడం, ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సభలో పరిపాలన వికేంద్రీకరణకు అనుగుణంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల విధానాన్ని ఆయన ప్రశంసించారు. దీంతో జేపీ వైసీపీలో చేరతారని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలను లోక్‌సత్తా పార్టీ ఖండించింది.
అలాంటిది ఇప్పుడు ఎన్నిక వేళ వైసీపీ పాలన గూండా రాజ్యం తలపిస్తుందంటూ చేసిన వ్యాఖ్యులు అధికార పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఇక ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు జేపీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. వైసీపీ పాలనపై ప్రముఖులు, మేధావుల అభిప్రాయం ఇది అంటూ ట్రోల్ చేస్తున్నారు.