CM Jagan:మంచి చేస్తుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు ఏడుస్తున్నారు: సీఎం జగన్

  • IndiaGlitz, [Thursday,December 21 2023]

ప్రజలకు మంచి చేస్తున్న తనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌(Pawankalyan) దిగజారి మాట్లాడుతున్నారని సీఎం జగన్(CM Jagan) తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా విద్యార్థులకు ట్యాబులు పంపణీ చేశారు. చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిజిటల్‌ క్లాసులు(Digital classes) విన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే విపక్ష నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులపై విషం కక్కుతున్నారని.. పిల్లలకు మంచి చేస్తుంటే ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ.33వేలు లబ్ధి కలుగుతుందన్నారు. విద్యార్థులకు ట్యాబులు ఇస్తే చెడిపోతున్నారట.. ఏవేవో వీడియోలు చూస్తున్నారట.. గేమ్స్ ఆడుతున్నారట అని దొంగ ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే.. మన పిల్లలు దేశంలోనే అత్యత్తమంగా ఉండాలన్నారు, తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్‌తో ప్రభుత్వ స్కూల్స్ పోటీ పడే పరిస్థితి వచ్చిందన్నారు. నాడు- నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చామని పేర్కొన్నారు. పేదరికం సంకెళ్లు తెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చూట్టామని చెప్పారు.

గత ప్రభుత్వం కన్నా అప్పులు తక్కువ చేసినా.. కానీ పది లక్షల కోట్లు అప్పులు చేసినట్లుగా ఎల్లో మీడియాతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగున్నరేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అక్క, చెల్లెమ్మల ఖాతాలో వేశానని ఆయన చెప్పుకొచ్చారు. తన మేనిఫెస్టోలో 99.5 శాతం పథకాలు అమలు చేశానని ప్రకటించారు. మీ బిడ్డ జగన్ విద్యార్థులకు మంచి చేస్తుంటే దుబారాగా ఖర్చు పెడుతున్నారని విమర్శిస్తున్నారని.. ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి భవిష్యత్ కోసమేనన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని.. నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఆయన ప్రభుత్వంలో ఇసుక నుంచి మద్యం వరకు అన్నీ స్కాములేనని జగన్ ఆరోపించారు.