అసెంబ్లీ టుడే: జగన్ మాటలకు చంద్రబాబు సైలెంట్..!

  • IndiaGlitz, [Monday,December 16 2019]

దళితుల విషయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రదర్శిస్తున్న కపట ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు. ఇవాళ అసెంబ్లీలో.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్లు ఏర్పాటు విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ సందర్భంగా.. చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. స‌భ‌లో వైఎస్ జగన్ మాట్లాడుతున్నంతసేపూ చంద్రబాబు మిన్నకుండిపోయారు.

గొడవ చేస్తున్నారేం!?

‘చంద్రబాబు నోరు తెరిస్తే అబ‌ద్ధాలు.. మోసాలు. ప్రపంచంలో ఇంతదారుణంగా మోసాలు చేసే వారు చంద్రబాబు త‌ప్ప ఇంకొక‌రు ఉండ‌రేమో. స‌భ‌లో చంద్రబాబు మాట్లాడినంతసేపూ మా స‌భ్యులు నిశ్శబ్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి క‌న్లూజ‌న్ ఇచ్చే స‌మ‌యంలో గొడ‌వ చేస్తున్నారు. సీఎం చెప్పే నిజాలు బ‌య‌టి ప్రపంచానికి తెలియ‌కూడ‌ద‌ని ఆరాట‌ప‌డుతున్నాడు. 2003లో ఏపీ స్టేట్ క‌మిష‌న్ తెచ్చాన‌ని చంద్రబాబు చెప్పుకోవ‌డం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 1992లోనే నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ ఎస్టీ ఎస్సీ ఏర్పాటైంది. ఈయ‌న మాత్రం 1994-95 నుంచే సీఎం అయ్యుండి కూడా ఏనాడూ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న చేయ‌లేదు. కానీ 2003లో ఎన్నిక‌లొస్తుంటే హ‌డావుడిగా ఎస్సీఎస్టీ క‌మిష‌న్ ఏర్పాటు చేశాడు త‌ప్ప.. వారికి మేలు చేయాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు ఏమాత్రం లేదు. పైగా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రు కోరుకుంటారు అని చెప్పడం తెలుగు ప్రజ‌లంద‌రికీ తెలుసు. ఆనాడు ఆయ‌న కేబినెట్లో మ‌రో మంత్రి ద‌ళితులు స్నానం చేయ‌రు, శుభ్రంగా ఉండ‌రు, చ‌దువుకోరు అని నీచంగా మాట్లాడినా ఆయ‌న మీద చ‌ర్యలు తీసుకోలేదు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

ఎంత‌కైనా దిగ‌జారే వ్యక్తిత్వం!

‘రాజ‌ధానిలో సీఆర్‌డీఏ ప్యాకేజీల్లోనూ చిన్నచూపు చూశాడు. ఓసీల‌ ప‌ట్టా భూమ‌ల‌కు ఎక‌రాకు వెయ్యి గ‌జాలు రెసిడెన్షియ‌ల్ ల్యాండ్‌, క‌మ‌ర్షియ‌ల్ ప్లాట్ 250 గ‌జాలు, అదే వెట్ ల్యాండ్ అయితే ఎక‌రాకు వెయ్యి గ‌జాలు రెసిడెన్షియ‌ల్ ల్యాండ్‌, క‌మ‌ర్షియ‌ల్ ల్యాండ్ 450 గ‌జాలు ఇస్తాన‌న్నాడు. కానీ బీసీ, ఎస్టీ, ఎస్సీల‌కు చెందిన అసైన్డ్ ల్యాండ్ విష‌యంలో మోసం చేశాడు. వారికి ఎక‌రాకు రెసిడెన్షియ‌ల్ ల్యాండ్ 800 గ‌జాలు కాగా క‌మ‌ర్షియ‌ల్ ల్యాండ్ 100 గజాలు, అదే వెట్ ల్యాండ్ విష‌యంలో ఎక‌రాకు రెసిడెన్షియ‌ల్ ల్యాండ్ 800 గ‌జాలు క‌మ‌ర్షియ‌ల్‌ ల్యాండ్ 200 గ‌జాలు ఇస్తాన‌ని మోసం చేశాడు. ఎక్కడ చూసినా ద‌ళితులు, బీసీలు, ఎస్టీలు మైనారిటీల విష‌యంలో తీవ్ర వివ‌క్ష చూపించాడు. కానీ ఈయ‌న మాత్రం దళిత‌జ‌నోద్ధారకుడిలా మాట్లాడ‌తాడు. రాజ‌కీయాల కోసం ఎంత‌కైనా దిగ‌జారే వ్యక్తిత్వం నారా చంద్రబాబు నాయుడిది. అన్నదమ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టగ‌ల‌డు, పిల్లనిచ్చిన మామ‌ను వెన్నుపొటు పొడ‌వ‌గ‌ల‌డు. అందుకే 36 సీట్లలో టీడీపీ కేవ‌లం ఒకే ఒక్క సీటు గెలిచింది. వందేళ్ల నాడే చంద్రబాబు లాంటి నైజం గురించి గుర‌జాడ అప్పారావు ఒక మాటన్నారు. ఎంచిచూడ‌క మ‌నుష్యులందున మంచిచెడులు రెండే కుల‌ములు.. మంచి అన్నది మాల అయితే నేను ఆ మాల‌నౌతా అన్నారు. వందేళ్ల త‌ర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఎవ‌రైనా ద‌ళితులుగా పుట్టాల‌ని కోరుకుంటారా అని మాట్లాడుతున్నాడు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

చారిత్రాత్మక నిర్ణయం!

‘నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చాం. కృష్ణా జిల్లాను ప‌రిశీలిస్తే మార్కెట్ క‌మిటీల్లో 19కి ప‌ది చోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. ఇది మా గొప్పత‌నమ‌ని గ‌ర్వంగా చెప్పుకుంటున్నాం. చంద్రబాబు సొంతూరు నారావారి ప‌ల్లెలో ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీల‌కు ఆల‌య ప్రవేశం లేదు. కానీ మా ప్రభుత్వంలో వారికి ఆల‌యాల్లో 50 శాతం నామినేటెడ్ పోస్టులు కేటాయించి సంచ‌ల‌నం సృష్టించాం. ఇది ఖ‌చ్చితంగా చారిత్రాత్మక నిర్ణయం’ అని వైఎస్ జగన్ తెలిపారు.