పవన్ ర్యాలీకి మద్దతిచ్చిన చంద్రబాబు...
- IndiaGlitz, [Thursday,October 31 2019]
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత సంభవించిందని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలువురు భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టాయి. నవంబర్-3న ఇసుక కొరతపై లాంగ్ మారచ్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను మద్దతు కోరారు పవన్. ఈ మద్దతుపై చంద్రబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. పవన్ తలపెట్టిన నిరసన ర్యాలీకి టీడీపీ మద్దతు ఉంటుందని బాబు స్పష్టం చేశారు.
ఇసుక మాఫీయాను అరికట్టే వరకూ పోరాడుతాం!
‘ఇసుక కొరత వల్ల భవన నిర్మాణాలు ఆగిపోయాయి. భవన కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత ఏపీలోనో ఎందుకు ఉంది..?. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతోంది. ఏపీలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించారు. ఇసుక మాఫీయాను అరికట్టే వరకూ మేం పోరాడుతాం. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. టీడీపీ శ్రేణుల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. మీడియాను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2430 జీవోను తక్షణమే రద్దు చేయాలి. ఆ జీవో రద్దు చేసే వరకూ పోరాడుతాం. ఇది ఒక్క ఏపీ అంశమే కాదు.. జాతీయ సమస్య. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవసరం. రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చిన సింగపూర్ కన్సార్టియంను తరిమేశారు’ అని ఏపీ సర్కార్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.