చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాజా చెయ్యి వేస్తే..ఆడియో రిలీజ్
- IndiaGlitz, [Saturday,March 26 2016]
నారా రోహిత్ - ఇషా తల్వార్ - నందమూరి తారకరత్న కలసి నటించిన చిత్రం రాజా చెయ్యి వేస్తే. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన రాజా చెయ్యి వేస్తే ఆడియో రిలీజ్ కార్యక్రమం విజయవాడలో సినీ, రాజకీయ నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరై ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని నందమూరి బాలకృష్ణకు అందచేసారు. బాలకృష్ణ రాజా చెయ్యి వేస్తే థియేటర్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...తెలుగు సినిమాకి ఓ చరిత్ర ఉంది. హిందీ తర్వాత ఎక్కువగా సినిమాలు తీసేది మన తెలుగులోనే. భారతదేశంలో సంవత్సరానికి సుమారుగా పదివేల కోట్లు బిజినెస్ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పలు అందమైన లోకేషన్స్ ఉన్నాయి. చిత్రపరిశ్రమ ముందుకు వస్తే...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుంది. బాణం సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన నారా రోహిత్ బాణంలా దూసుకెళుతున్నాడు. ఈ సినిమాలో నందమూరి తారకరత్న విలన్ గా నటించాడని తెలిసింది. సాయి కొర్రపాటి మంచి చిత్రాలను నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. నారా రోహిత్ - నందమూరి తారకరత్న కలసి నటించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ...సాయి కొర్రపాటి నాతో లెజెండ్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు నారా రోహిత్ - నందమూరి తారకరత్నతో కలసి రాజా చెయ్యి వేస్తే చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ చూస్తుంటే....ఏమాత్రం రాజీపడకుండా నిర్మించారని తెలుస్తుంది. సాయి కొర్రపాటిని నిర్మాత అని అనను ఎందుకంటే ఆయన నాకు సోదరుడుతో సమానం. సాయి కార్తీక్ మంచి బాణీలను అందించాడు. డైరెక్టర్ ప్రదీప్ కొత్తవాడైనా నటీనటులు నుంచి మంచి నటను రాబట్టుకున్నాడు. నందమూరి తారకరత్న విలన్ నటించాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ...బాలకృష్ణ గారితో లెజెండ్ చిత్రాన్ని నిర్మించిన వారాహి చలనచిత్రం బ్యానర్ లో నేను నటించడం ఆనందంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ తో నాకు ఇది ఐదవ సినిమా. ప్రదీప్ ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఇషా తల్వార్, నందమూరి తారకరత్న,డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, గీత రచయితలు కాసర్ల శ్యామ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.