Chandra Babu:సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ 9వ తేదికి వాయిదా

  • IndiaGlitz, [Tuesday,October 03 2023]

స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ ఉదయం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పులో 17Aను తప్పుగా అన్వయించారని సాల్వే వాదించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించిందని.. కానీ హైకోర్టు తీర్పులో మాత్రం చంద్రబాబు ఆదేశాలు.. అధికార విధుల్లో భాగంగా ఇచ్చినవే అని ఉందని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని.. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకుందని వివరించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైతే అప్పటి నుంచే 17A వర్తిస్తుందని.. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదని తెలిపారు. 2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్‌లు అన్నింటికీ 17A వర్తిస్తుందన్నారు. అప్పటి మంత్రివర్గం నిర్ణయం మేరకే స్కిల్‌ కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు.

2017లోనే ఈ కేసు విచారణ మొదలైంది.. 17ఏ వర్తించదు..

మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపించారు. 2017లోనే ఈ కేసు మొదలైంది కాబట్టి 17ఏ వర్తించదని తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారని గుర్తుచేశారు. ఇందులో కేవలం 10శాతం ప్రభుత్వం, 90శాతం సిమెన్స్ సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారన్నారు. ఆ వెంటనే 10శాతం నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయని వాదించారు. అరెస్టైన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారని.. హైకోర్టు దీనిని కొట్టివేసిందన్నారు. దీంతో హైకోర్టు ముందు ఉంచిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పు సవాల్ చేసిన చంద్రబాబు..

క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే విచారణ నుంచి జస్టిస్ వెంకట నారాయణ భట్టి నాట్ బిఫోర్ మి అంటూ తప్పుకున్నారు. దీంతో అదే రోజు ప్రధాన న్యాయమూర్తి డీజే చంద్రచూడ్ ధర్మాసనం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. మరో బెంచ్‌కు విచారణను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

ఇక అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని లూథ్రా వాదించగా.. అలాంటిది ఏం లేదని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు పక్షాలు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.