భావితరాల భవిష్యత్తుకు ప్రతీక అమరావతి.. బాబు భావోద్వేగం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గురువారం నాడు అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు రాజధాని రైతులు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. గురువారం జరిగిన ఘటనలపై అమరావతిలోనే బాబు మీడియా మీట్ నిర్వహించి.. వైసీపీ సర్కార్‌పై దుమ్మెత్తి పోశారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోని ఐదారు గొప్ప నగరాల్లో ఒక నగరంగా అమరావతిని తయారు చేయాలని భావించానని.. బాబు ఒకింత భావోద్వేగాని లోనయ్యారు.
భావితరాల భవిష్యత్తుకు ప్రతీక!
ఏపీ రాజధాని అమరావతి ఒక మతానికో, కులానికో సంబంధించినది కాదని.. ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన విషయమని.. రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలన్నా ఆదాయం కావాలని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు. అలాంటి ఆదాయాన్ని సమకూర్చే ఏకైక నగరం అమరావతి అని ఆయన తెలిపారు. అమరావతి ఒక కాస్మోపాలిటన్ సిటీ అని, భావితరాల భవిష్యత్తుకు ప్రతీక అని ఆయన తెలిపారు. నాడు రాజధాని నిర్మాణం కోసం తాను ఓ సంకల్పం చేశానని, నేడు దుర్మార్గమైన పాలనలో దీని నిర్మాణాన్ని నిలిపివేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధానికి సంబంధించిన వైసీపీ నేతలు చెప్పిన విషయాలపై ఓసారి ఆలోచించాలని, తమ హయాంలో జరిగిన పనులకు వైసీపీ వాళ్లు చెప్పిన మాటలకు పొంతనే లేదన్నారు.
సామాన్యుల సంగతేంటి!?
‘నాడు నేను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారు. అమరావతిలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పడానికి, రాజధాని నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే ఇక్కడికి వచ్చాను. రైతులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. వైసీపీ తమ రౌడీలను పంపించి బస్సుపై దాడి చేయిస్తే అద్దాలు పగిలిపోయాయి. మా మీదనే ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారంటే.. ఇక సామాన్య ప్రజానీకం అంటే ఎంత చులకనో ఆలోచించాల్సిన అవసరం వుంది’ అని బాబు మీడియా మీట్లో చెప్పుకొచ్చారు. మరి బాబు వ్యాఖ్యలకు వైసీపీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments