పేపర్ లీక్ అంటూ చంద్రబాబు ముఠా డ్రామాలు : విజయసాయి రెడ్డి
- IndiaGlitz, [Saturday,September 21 2019]
ఏపీలో గ్రామ సచివాలయ పరీక్ష లీకేజీ రగడ భగ్గుమంటుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగాయ్. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ లు... వైసీపీపై నిప్పులు చెరిగారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ అంటే పరీక్షా పత్రం లీక్ చేయడమా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. లక్ష 26 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటనలు ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి... పేపర్ లీక్ తో 18 లక్షలకు పైగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ. 5 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదేనా మీ విశ్వసనీయత అంటూ ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి..... బాబు, లోకేశ్ లకు ఘాటుగా సమాధానమిచ్చారు. '' పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్ సెంటర్ల చుట్టూ తిరిగింది. ఎవరూ తప్పుపట్టలేదు. చివరకు తమరే పూనుకుని ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమనడం ఊహించిందే కదా చంద్రబాబు నాయుడు గారూ. మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్యపోవాలి.'' అంటూ చురకలు అంటించారు.
1983లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీచర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.398 వేతనంగా ఇచ్చి ఏళ్ల తరబడి హింసించింది మీరే అంటూ ప్రతి విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి.... ఇప్పుడు 4 లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమిస్తుంటే చంద్రబాబు ముఠా కళ్లలో నిప్పులు పోసుకుంటోందన్నారు. జీత భత్యాలపై శాడిస్టిక్ సెటైర్లు వేస్తోందని ఫైర్ అయ్యారు.