కూటమి కథ కంచికేనా.. సభ అట్టర్ ఫ్లాప్‌తో బాబు, పవన్ ఆశలు గల్లంతు..
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చాక చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రజాగళం పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీనే సభకు హాజరుకానుండడంతో సభపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కాపురం చేసే కళ కాళ్లు తొక్కినప్పుడే తెలుస్తుంది.. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థం అవుతుంది అనే సామెత ఈ సభకు సరిగ్గా వర్తిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిగా నిర్వహించిన మొదటి సభ ఘోరంగా విఫలమైంది.
మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్న ఈ సభ అన్నివిధాలా ఫెయిల్ అయిందని అన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏ అంశంలోనూ ఏ విధంగానూ ఈ సభ పెద్దగా ఆకట్టుకోలేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎంతలా ఫెయిల్ అయిందంటే ఏకంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు మైక్ కట్ అయింది. దేశాన్ని శాసించే వ్యక్తి మాట్లాడే సభలో మైక్ పనిచేయలేదంటే సభ ఎంత అధ్వాన్నంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. మరోసారి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న సమయంలోనూ కరెంట్ పోల్స్ మీద జనం ఎక్కగా.. ప్రధాని లేచి వారిని నిలువరించాల్సి వచ్చింది. అప్పటిదాకా చంద్రబాబు కానీ మరే నాయకుడు పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే సాధారణంగా ఏ సభలో అయినా జోకులు, ఛలోక్తులు, చమత్కారాలతో సరదాగా మాట్లాడే ప్రధాని ఈ సభలో మాత్రం అత్యంత సాదాసీదాగా మాట్లాడి మమ అనిపించారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖాల్లో ఎక్కడా జోష్ కనిపించకపోగా అందరూ ముభావంగా ఉన్నారు. అలాగే మోదీ కూడా టీడీపీ, జనసేనను గెలిపించమని తన ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన ప్రసంగం అంతా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగిందంటున్నారు. కేంద్రంలో తమకు 400 సీట్లు ఇవ్వండి అని కోరడమే తప్ప తమ గురించి ఏమీ చెప్పకపోవడం టీడీపీ, జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంలో ముంచేసింది. ఈ సభతో కూటమికి ఎక్కడలేని జోష్ వస్తుందని ఆశించిన చంద్రబాబు, పవన్ అశలు ఆడియాశలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments