అప్పుడు టెన్షన్ కంటే ఎక్కువ బాధపడ్డాను....నాగార్జున గారు 10సార్లు కంగ్రాట్స్ చెప్పినప్పుడు ఆ బాధపోయి కాన్ఫిడెన్స్ వచ్చింది - చందు మొండేటి
- IndiaGlitz, [Monday,October 10 2016]
కార్తికేయ సినిమాతో దర్శకుడిగా పరిచయమై...తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన యువ దర్శకుడు చందు మొండేటి. ఆతర్వాత అక్కినేని నాగ చైతన్యతో చందు మొండేటి తెరకెక్కించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ప్రేమమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రీమేక్ అయినప్పటికీ మన నేటివిటికి తగ్గట్టు ప్రేమమ్ చిత్రాన్ని చందు చాలా బాగా తెరకెక్కించాడు...చైతు అద్భుతంగా నటించాడు అంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసలు అందిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా ప్రేమమ్ దర్శకుడు చందు మొండేటి తో స్పెషల్ ఇంటర్ వ్యూ మీకోసం...!
ప్రేమమ్ అంచనాలకు మించిన విజయాన్ని సాధిస్తోంది. మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..? కింగ్ నాగార్జున ఏమన్నారు..?
మీరన్నట్టుగా అంచనాలకు మించి విజయాన్ని సాధిస్తోంది. అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ రోజు మిడ్ నైట్ దుబాయ్ లో ఫస్ట్ షో వేసారు. అక్కడ నుంచి ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది. ఆతర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల నుంచి సినిమా చాలా బాగుంది చైతు అద్భుతంగా నటించాడు ఇలా మంచి రిపోర్ట్ వచ్చింది. ఇక నాగార్జున గారు ఈ సినిమాని ఇప్పుడు కాదండి పది రోజుల ముందే నాగార్జునగారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు కలసి చూసారు. సినిమా చూసిన తర్వాత నాగార్జున గారు ఓ పది సార్లు కంగ్రాట్స్ చెప్పారు. అలాగే త్రివిక్రమ్ గారు కూడా చాలా బాగుంది అని అభినందించారు. వీరిద్దరు అభినందించడంతో నాకు కాన్పిడెన్స్ వచ్చింది. సినిమా చూసి జెన్యూన్ గా చాలా బాగుంది అని చెబుతున్నారు. సో...చాలా హ్యాపీగా ఉంది.
నాగార్జున, త్రివిక్రమ్ ప్రేమమ్ చూసి బాగుంది అని చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నారు కదా...! అంతకు ముందు మీకు ఈ మూవీ పై కాన్ఫిడెన్స్ లేదా..?
నా దగ్గర ఓ 10 పది కథలు ఉన్నాయి. నాకు రీమేక్ చేయడం పెద్దగా ఇంట్రస్ట్ ఉండదు. అందుచేత నా మైండ్ ప్రేమమ్ రీమేక్ చేయద్దు అని చెప్పింది. సినిమా పై కాన్ఫిడెన్స్ లేక కాదు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే టెన్షన్. అందుచేత నాగార్జున గారు, త్రివిక్రమ్ గారు చాలా బాగుంది అని చెప్పడంతో నాకు ఫుల్ కాన్పిడెన్స్ వచ్చింది.
చైతన్య హీరోగా మీ కథతో సినిమా చేయాలనుకున్నారు కదా..! రీమేక్ ఎందుకు చేయాల్సి వచ్చింది..?
చైతన్యతో సినిమా చేయాలని కథ చెప్పాను. ఆ కథ చైతన్యకు నచ్చింది. మేము అనుకున్న కథతో ట్రావెల్ చేస్తున్నాం. ఇంతలో ప్రేమమ్ సినిమా రిలీజైంది. ప్రేమమ్ సినిమాని ఫస్ట్ చూసింది నేనే. చైతన్యకు ప్రేమమ్ బాగుంది అని చెప్పింది కూడా నేనే. రెండు వారాల తర్వాత ఓ పది మంది ప్రొడ్యూసర్స్ ప్రేమమ్ రీమేక్ లో నటించమని చైతన్య అడిగారు. ఇంత మంది ప్రేమమ్ గురించి చెబుతున్నారు ఏమిటా సినిమా అని చైతన్య చూడడం చైతన్యకు కూడా నచ్చడం జరిగింది. అప్పుడు చైతన్య ప్రేమమ్ రీమేక్ చేద్దాం నువ్వు డైరెక్ట్ చేయాలి అన్నారు. ముందు కాస్త టెన్షన్ పడ్డాను. ఆ టైమ్ లో కొంత మందికి ఈ న్యూస్ తెలిసి ప్రేమమ్ చేస్తున్నావ్ నువ్వు లక్కీ అంటూ కంగ్రాట్స్ చెప్పడం మొదలెట్టారు. ఇక అప్పుడు చేద్దాం అని ఫిక్స్ అయ్యాను.
మూడో ప్రేమకథకి హీరోయిన్ గా సమంతని పెడితే ఇంకా బాగుండేదేమో కదా..! మీరేమంటారు..?
ముగ్గురు హీరోయిన్స్ లో ఎవరో ఒకరు స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. మీరన్నట్టుగా మూడో ప్రేమకథకు సమంత అయితే బాగుంటుంది అని మాకు కూడా అనిపించింది. అయితే...శృతిహాసన్ కన్ ఫర్మ్ అయిన తర్వాత ఇక స్టార్ హీరోయిన్ అవసరం లేదు అనుకున్నాం.
ఈ మూవీకి టైటిల్ ముందుగా మజ్ను అనుకున్నారు కదా...మరి మలయాళం టైటిల్ ప్రేమమ్ పెట్టడానికి కారణం..?
నిజమే...ముందు మజ్ను అనుకున్నాం. అయితే..మజ్ను అంటే సాడ్ లవ్ స్టోరీ అనుకుంటారేమో అనిపించింది. పైగా ప్రేమమ్ సౌండ్ బాగుంది. ప్రేమమ్ అంటే సంస్కృతంలో ప్రేమ అని తెలిసింది. మా యూనిట్ మెంబర్స్ అందరూ ప్రేమమ్ అయితేనే బాగుంటుంది అనడంతో ప్రేమమ్ పెట్టాం.
ఈ సినిమాలో హీరో చైతన్య మూడో ప్రేమకథలో హీరోయిన్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు హీరో తన సమాధానం చెప్పడానికి 1 నిమిషం టైమ్ తీసుకుంటాడు. రెండు స్లారు లవ్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి వెంటనే ఓకే చెప్పేయచ్చు కదా...?
అప్పుడు హీరో వయసు 30 సంవత్సరాల పైనే ఉంటుంది కదా..! ఆ వయసు వచ్చినప్పుడు మనం ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అందుకనే అలా పెట్టాను.
హీరో టీనేజ్ లవ్ స్టోరీ జరుగుతున్నప్పుడు వచ్చే ఫస్ట్ సాంగ్ లో ఓ చోట తొలిప్రేమ పోస్టర్ చూపించారు. ఇది హీరోకి తొలి ప్రేమ అని చెప్పడం కోసమా..?
కరెక్ట్ అండి. మీరు బాగా అబ్జర్వ్ చేసారు. గుర్తు చేసినందుకు థ్యాంక్స్.
వాయిస్ ఓవర్ లో నాగార్జున నీ అయ్యా...అంటే తలకాయ పగిలిపోవాల్సిందే అన్నారు ఈ డైలాగ్ మాస్ ఆడియోన్స్ కోసం పెట్టారు అనుకోవచ్చా...?
కరెక్టే మాస్ ఆడియోన్స్ కోసం పెట్టాం.
సైకిల్ చైన్ పై సర్వహక్కులు మావే....డైలాగ్ అదిరింది. మీలో ఉన్న నాగ్ ఫ్యాన్ బాగా బయటకు వచ్చినట్టున్నాడు..?
బాగా ఏమి బయటకు రాలేదండి. బాగా బయటకు రావడం అంటే ఇంకోలా ఉండేది. సైకిల్ చైన్ అంటే అందరికి నాగార్జున గారే గుర్తుకువస్తారు నిజమే కదా...(నవ్వుతూ...)
మీరు ఎప్పటి నుంచి నాగ్ ఫ్యాన్ అయ్యారు...?
నేను చెన్నైలో ఇంజనీరింగ్ చేసాను. అక్కడ యువసమ్రాట్ ఫ్యాన్స్ అని చాలా మంది ఉండేవాళ్లు. మన వాళ్లు ఇక్కడ కూడా ఉన్నారా అనుకున్నాను. ఓసారి భీమవరం వచ్చినప్పుడు అల్లరి అల్లుడు సినిమా చూసాను. అల్లరి అల్లుడు రిలీజ్ రోజు థియేటర్ లో ఒకటే అరుపులు కేకలు ఈలలు ఏదో పూనకం వస్తే ఎలా ఉంటుందో అందరూ అలా ఉన్నారు. అప్పుడు నాగార్జున గారు నాకు సూపర్ మేన్ లా కనిపించారు.అప్పటి నుంచి నాగార్జున గారు అంటే బాగా అభిమానం. నాగార్జున గార్ని ఎప్పటికైనా కలవాలి అని మా నాన్న గారితో చెబితే...నాగార్జున గార్ని అందరూ కలుస్తారు నువ్వు కలిసేవంటే ఓ స్పెషాలిటీ ఉండాలి నీకంటూ ఐడెంటిటీ ఉండాలి అని చెప్పారు. అది నాకు బాగా మైండ్ లో పడింది.
నాగార్జున తోఓ డిఫరెంట్ పోలీస్ స్టోరీతో సినిమా చేయాలి అనుకున్నారు కదా...! ఎప్పుడు..?
అవునండి. నాగార్జున గార్ని దృష్టిలో పెట్టుకునే ఆ కథ రాసుకున్నాను. నాగార్జున గారితో తప్పకుండా సినిమా చేస్తాను.
మీరు రైటర్ కమ్ డైరెక్టర్ కదా..? మీలో రైటర్ స్పీడా..? డైరెక్టర్ స్పీడా..?
రైటర్ స్లో...డైరెక్టర్ స్పీడు..!
సోషల్ మీడియాలో మన ప్రేమమ్ రిలీజ్ కి ముందు కామెంట్స్ వచ్చాయి కదా. అప్పుడు టెన్షన్ పడ్డారా...?
అసలు కామెంట్స్ ఎందుకు వచ్చాయో అర్ధం కాలేదు. ఇలా కామెంట్స్ వస్తున్నాయి ఏమిటి అని టెన్షన్ పడడం కన్నా ఎక్కువుగా బాధపడ్డాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏమిటి..?
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా ఉంటుంది. అలాగే దిల్ రాజు గారు ఓ సినిమా చేద్దాం అన్నారు. నా మూడవ సినిమా మాత్రం వేరే బ్యానర్ లో ఉంటుంది. త్వరలో పూర్తి వివరాలు తెలియచేస్తాను.