Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి "పద్మవిభూషణ్" పురస్కారం ప్రకటించే అవకాశం..!
Send us your feedback to audioarticles@vaarta.com
కొంతమందికి అవార్డులు పేరు తెచ్చి పెడితే.. మరికొంతమందికి ఆ అవార్డులు రావడమే వాటికి అందం తెచ్చిపెడతాయి. ఈ కోవలోకి మెగాస్టార్ చిరంజీవి వస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా హీరోగా, రాజకీయ నాయకుడిగా, సేవకుడిగా పేరు గడించిన చిరంజీవి.. ఇప్పుడు ఓ అరుదైన మైలురాయి అందుకోబోతున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకోగా.. తాజాగా మరో అత్యున్నత పురస్కారం ఆయన ఇంటి తలుపు తట్టనుంది. దేశంలోనే భారతరత్న తర్వాత అత్యంత గౌరవంగా భావించే "పద్మవిభూషణ్" అవార్డును దక్కించుకోబోతున్నారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కూడా రిప్లబిక్ డే రోజున పద్మ అవార్డులను ప్రకటించనున్నారు. అయితే ఈసారి ప్రకటించే అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల తరపున "పద్మవిభూషణ్" అవార్డుకు చిరంజీవి పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ అవార్డుకు చిరు పేరు ప్రకటిస్తే మన తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీకే గర్వ కారణం కానుంది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపించడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసే వారికీ ఈ "పద్మవిభూషణ్" అవార్డును ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఓ సామాన్య నటుగిగా తన ప్రస్థానం ప్రారంభించి ఏకంగా మెగాస్టార్‌గా చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించే స్థాయికి ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
అలాగే 'చిరంజీవి ఐ అండ్ బ్లండ్' బ్యాంక్ స్థాపించి ఆపదలో ఉన్న వారికి నేత్రదానంతో పాటు రక్తదానం అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఆయన సేవలను కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2006లోనే ఈ అవార్డు ఆయన అందుకోవడం విశేషం. మళ్లీ 18 ఏళ్ల తర్వాత పద్మవిభూషణ్ అవార్డ్ కూడా అందుకోనుండడం ఆయన కష్టానికి ఫలితంగా కొనియాడవచ్చు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డు ఇప్పటివరకు అతి కొద్ది మందినే ఈ అత్యున్నతమైన అవార్డ్ వరించింది.
1955వ సంవత్సరం ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావ్, అంజనాదేవి దంపతులకు తొలి సంతానంగా పశ్చిమగోదావరి జిల్లాలో చిరంజీవి జన్మించారు. అనంతరం సినిమాలపై మక్కువతో మద్రాస్ చేరుకుని స్వయంకృషితో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అగ్రహీరోగా ఎదిగారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకుని దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రికార్డ్ సృష్టించారు. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టినా ప్రజల కోసం ఏమైనా చేయాలనుకునే ఆలోచనతో ఐ అండ్ బ్లండ్ బ్యాంక్ స్థాపించారు. సినిమాల్లో ఉంటే ప్రజలకు మరింత సేవ చేయలేనని భావించిన ఆయన.. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు.
పార్టీ పెట్టిన 9 నెలల్లోనే మహా మహా నాయకులను ఢీకొని ప్రజల మన్ననలు పొంది 18 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. కానీ తన సున్నితమైన మనస్తత్వానికి ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేనని భావించిన చిరు.. మళ్లీ 2017లో ఖైదీ నెంబర్ 150 ద్వారా గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటి నుంచి ఈ వయసులో కూడా తనలోని గ్రేస్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఎన్నో రికార్డులు, రివార్డులు, అవార్డులు అందుకున్న ఇలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం 'పద్మవిభూషణ్' అవార్డుతో సత్కరించనుండటం మరెంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout