యాక్షన్ సినిమాలకు సరిపోయే బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. అయితే ఈయనకు హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. హిట్ కోసం గోపీచంద్ మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో తమిళ దర్శకుడు తిరు, ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ కాంబినేషన్‌లో గోపీచంద్ చేసిన చిత్రం `చాణక్య`. సినిమాలో హీరో స్పై అని, ట్రెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ను అడ్డుకునే హీరో కథ ఇదని సినిమా టీజర్, ట్రైలర్ చూడగానే మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి స్పై థ్రిల్లర్ చేయడం గోపీచంద్‌కు కొత్తగానే ఉంది. మరి ఈ సినిమా ఆయనకు విజయాన్ని అందించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం.
కథ:
భారతదేశాన్ని టెర్రరిస్టుల దాడి నుండి కాపాడే సంస్థల్లో రా ఒకటి. దానికి సంబంధించిన ఏజెంట్స్ కొందరు పాకిస్థాన్‌లో ఉంటారు. వారి వివరాలు సలీమ్ అనే ఓ టెర్రరిస్ట్‌కు తెలుస్తుంది. అయితే ఆలోపు అర్జున్(గోపీచంద్), తన స్నేహితులతో కలిసి దాడి చేసి సలీమ్‌ను బంధిస్తాడు. మరో పక్క బయట మాత్రం రామకృష్ణ అనే బ్యాంకు ఉద్యోగిగా ఉంటాడు. ఆ క్రమంలోనే ప్రియా(మెహరీన్)తో తనకు పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే పాకిస్థాన్‌కు చెందిన ఖురేషి అనే టెర్రరిస్ట్ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఉగ్రదేశంగా నిలబెట్టడానికి ఓ భారీ పథకం వేస్తాడు. అందులో భాగంగా అర్జున్ స్నేహితులను కిడ్నాప్ చేస్తాడు. దమ్ముంటే పాకిస్థాన్ వచ్చి వాళ్లను కాపాడుకోమని అర్జున్‌కి సవాల్ కూడా విసురుతాడు. అప్పుడు అర్జున్ తన స్నేహితులను కాపాడుకోవడానికి ఏం చేస్తాడు? జునైదా ఎవరు? ఆమె సాయంతో అర్జున్ దేశ గౌరవాన్ని కాపాడాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
సమీక్ష:
నటీనటుల విషయానికి వస్తే... హీరో గోపీచంద్ ఇందులో రెండు షేడ్స్‌లో కనిపించాడు. ఒకటి బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ అనే పాత్రలో.. మరో పాత్ర రా ఏజెంట్ అర్జున్. ఈ రెండు షేడ్స్‌లో రా ఏజెంట్ షేడ్‌లో తను చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ ఎలిమెంట్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. లవ్ సీన్స్‌లో జస్ట్ ఓకే అనిపించాడు. ఇక మెహరీన్ పాత్రకకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మూడు పాటల్లో కనిపించింది. జరీనా ఖాన్ ఓ స్పెషల్ సాంగ్‌తో పాటు రా ఏజెంట్ రోల్‌లోనూ ఆకట్టుకుంది. మెహరీన్ కంటే జరీనాఖాన్ రోల్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ కనపడుతుంది. ఇక నాజర్, రఘుబాబు, అలీ, సునీల్, ఆదర్శ్ బాలకృష్ణ, రాజా తదితరులు వారి పాత్రల్లో నటించారు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు తిరు సినిమాలోని పాత్రలను, సన్నివేశాలను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. అతడు పెట్టించిన ఖర్చు మాత్రం తెరపై కనపడుతుంది. సినిమాలో లాజిక్స్ ఉండవు. సరే! లాజిక్స్ సంగతిని పక్కన పెట్టి చూద్దాంటే సన్నివేశాలు బోరింగ్‌గా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ చివరి 10 నిమిషాలు బావుంది. వెట్రి కెమెరా పనితనం బావుంది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా ఎలివేట్ చేశాడు. అబ్బూరి రవి డైలాగ్స్ ఒక ట్రెండు చోట్ల ఆకట్టుకున్నాయి. పాటలు బాగా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాలో కొత్తగా చెప్పుకునేంతగా ఏమీ లేదు.
బోటమ్ లైన్: చాణక్య.. ఆకట్టుకోదు
Comments