Champai Soren:ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరన్ ప్రమాణం.. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఝార్ఖండ్(Jharkhand) నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ (Champai Soren) ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈనెల 10వ తేదీ లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం(JMM) చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించింది. దీంతో వారంతా శుక్రవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ నగరంలోని ఎల్లా హోటల్లో బస ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈనెల 5న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి అలంగిర్ ఆలం వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సీఎంగా చంపై సోరెన్‌ను కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్‌కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వీలైనంత త్వరగా చంపై సోరెన్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు గురువారం రాత్రి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.
కాగా ఝార్ఖండ్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 81 స్థానాలు ఉండగా.. కేవలం కొల్హాన్ ప్రాంతం పరిధిలోనే 13 సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీకి చెక్ పెట్టేలా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని సీఎంని చేశారు జేఎంఎం పెద్దలు. అంతేకాకుండా వారసత్వ రాజకీయాలు చేస్తోందంటున్న కమలం నేతల విమర్శలకు కూడా ముకుతాడు వేసినట్లైంది. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు జేఎంఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీ ఓ స్థానం, సీపీఐ(ఎంల్) పార్టీకి మరో స్థానం ఉండటంతో కూటమి బలం 48గా ఉంది. ఇక ఎన్డీయే కూటమికి 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో బలపరీక్షలో ఇండియా కూటమి నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా కానీ ఎందుకైనా మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. వచ్చే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments