Revanth Reddy:రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న సవాళ్లు.. సీఎం పదవిని కాపాడుకుంటారా..?

  • IndiaGlitz, [Monday,December 18 2023]

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాజకీయాల్లో తన లక్ష్యాన్ని చేరుకున్న రేవంత్ రెడ్డికి.. ఆ పదవిని కాపాడుకోడమే ఇప్పుడు ముందున్న అతి పెద్ద సవాల్. అందుకే ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలో ఆయన ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చినందున ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు తొమ్మిదన్నరేళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ అండ్ కో ప్రతిపక్షంలో ఉండటం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వమే సంవత్సరం మాత్రమే అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా మీకు ఉంది 64 మంది మాత్రమే.. మాకు 39 మంది ఉన్నారు.. మీకు మాకు ఉన్న ఓట్ల శాతం కేవలం ఒకటిన్నర శాతం మాత్రమేనని తెలిపారు. దీనిని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న వారు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన వారు ఉన్నారని గులాబీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు సొంత పార్టీ నేతలే సీఎం పదవి కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ప్రస్తుతానికి రేవంత్‌ రెడ్డికి కత్తి మీద సాము వంటిదే. సొంత పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్లను రేవంత్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ పార్టీకి కేవలం 63 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ప్రభుత్వాన్ని స్థిరపర్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫార్ములాను అనుసరించ లేకపోలేదంటున్నారు .

ఇదిలా ఉంటే రానున్న లోక్‌సభ ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి సీఎంగా బలపడటానికి మరో పరీక్ష లాంటిది. మెజారిటీ స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. 10కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే రేవంత్ బలమైన నాయకుడిగా పార్టీలో ఎదుగుతారు. తక్కువ స్థానాలు వస్తే మాత్రం ఆయన నాయకత్వంపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. ఇటు పార్లమెంట్ ఎన్నికల లోపు ప్రభుత్వంలో తనదైన పాత్ర వేయడం.. హామీలు అమలు చేస్తూ ప్రజల్లో గొప్ప నాయకుడిగా ఎదగడం ప్రస్తుతం ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యాలు. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డికి తన పదవిని సుస్థిరం చేసుకోవడానికీ లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించడానికీ మూడు నెలల సమయం మాత్రమే ఉంది. అప్పటివరకు ఇటు ఎమ్మెల్యేలు, అటు ప్రజలు ఆయనను నిశితంగా గమనిస్తారు. కేసీఆర్‌ను మించిన నాయకుడు అని మెప్పించాలి.

ఉమ్మడి రాష్ట్రంలో దివంగత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బలమైన నాయకుడిగా అవతరించారు. అయితే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వైయస్సార్‌కు కలిసి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ వెసులుబాటు లేదు. సీనియర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిల నుంచి ఆయనకు ఎప్పుడూ పోటీ ఉంటుంది. అందుకే పరిస్థితులు తనకు అనుకూలంగా మారేంత వరకు ఆచితూచి వ్యవహిరంచడం.. అందరినీ కలుపుకోవడం అవసరం. ఓ సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్నట్లు రేవంత్ కూడా నడుచుకోవాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి వ్యవహారశైలి పరిశీలిస్తే అలాగే నడుచుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ తన ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచుకోవడంతో పాటు ప్రజల్లో బలమైన ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చేకునేలా పాలన అందించాల్సిన అవసరం ఉంది.

More News

Salaar:ఫ్యాన్స్‌కు పూనకాలే.. అదిరిపోయిన 'సలార్' రిలీజ్ ట్రైలర్..

రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో సలార్ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Barrelakka: పవన్ కల్యాణ్‌ గురించి అలా మాట్లాడటం బాధేసింది: బర్రెలక్క

బర్రెలక్క.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. సోషల్ మీడియాలో బర్రెల్కకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

CM Jagan:పేదవాడికి ఖరీదైన వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యం: సీఎం జగన్

'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

Bigg Boss Telugu 7 : హౌస్‌ను కనుసైగతో శాసించి.. చాణక్యుడిగా నిలిచి , బిగ్‌బాస్ చరిత్రలోనే శివాజీ రెమ్యూనరేషన్ ఓ రికార్డు

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు ట్రోఫీ ఎందుకు దూరమైంది.. రన్నరప్‌గా నిలిచినా వచ్చింది సున్నా

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలవగా..