Vijayawada MP: బెజవాడ గడ్డపై అన్నదమ్ముల సవాల్.. విజయం ఎవరికి దక్కుతుందో..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయ వాతావరణం తారా స్థాయికి చేరుకుంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే రాష్ట్రంలోని ఓ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం అందరిలో ఆసక్తి రేపుతోంది. అదే బెజవాడ ఎంపీ సీటు. రాజకీయాలకు చైతన్యంగా పేరు ఉన్న కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ సీటు ఎప్పుడూ కీలకంగా ఉంటుంది. తొలుత ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. కాలక్రమేణా కాంగ్రెస్, టీడీపీలు కూడా ఇక్కడ సత్తా చాటాయి. అయితే ఎక్కువ శాతం మాత్రం టీడీపీకే మంచి పట్టు ఉంది.
కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రమే కొతంకాలంగా అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఇదే సామాజికవర్గం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పోటీలో ఉండటం విశేషం. కేశినేని కుటుంబం గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. 1990వ దశకం నుంచే కేశినేని ట్రావెల్స్ అంటే అందరికీ సుపరిచితమే. అలాంటి కుటుంబం నుంచి కేశినేని నాని తొలుత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
అనంతరం తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే నాని పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానిక నేతలు ఆయనకు వ్యతిరేకం అయ్యారు. దీంతో అప్పటి నుంచి పార్టీతో అంటీముట్టనట్లు ఉన్నారు. ఈ సమయంలోనే నాని తమ్ముడు కేశినేని చిన్ని రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీలో ఉంటూనే తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో యువనేత నారా లోకేష్‌కు దగ్గరయ్యారు. దీంతో ఈసారి విజయవాడ ఎంపీ సీటు చిన్నికే ఖాయమనే ప్రచారం జరిగింది.
దీంతో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో విజయవాడ వైసీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. తాజాగా టీడీపీ కూడా బెజవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ప్రకటించింది. దాంతో సొంత అన్నదమ్ముల మధ్య సై అంటే సై అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయంపై ఇరువురు ధీమాగా ఉన్నారు. తనకు వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని నాని భావిస్తుండగా.. టీడీపీకి కంచుకోట కావడంతో పాటు జనసేన-బీజేపీ ప్రభావం ప్లస్ అవుతుందని చిన్ని అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి బ్రదర్స్ పోరు ఈసారి రాష్ట్రం మొత్తం ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఎవరూ గెలుస్తారనే దానిపై ఇరు పార్టీల కార్యకర్తలు బెట్టింగులు కూడా వేసుకుంటున్నారు. మరి బెజవాడ గడ్డ మీద అన్నదమ్ముల్లో ఎవరూ జెండా ఎగరవేస్తారో తెలియాలంటే జూన్ 4వరకు ఎదురుచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments