తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన హీరోల్లో విశాల్ ఒకరు. హీరో, నిర్మాత అయిన విశాల్ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఆ కోవలో ఈయన నిర్మించిన మరో చిత్రం చక్ర. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు పెరుగుతున్న డిజిటల్ వరల్డ్‌కు అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ఇది వరకు విశాల్ అభిమన్యుడు అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ కోవలో విశాల్ మరోసారి సైబర్ నేరాలపై చక్ర సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప‌్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
స్వాతంత్య్ర దినోత్సవం రోజున హైదరాబాద్ నగరంలో యాబై ఇళ్లలో కేవలం ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తారు. అది కూడా ముసలివాళ్లు మాత్రమే ఉండే ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తారు. కేవలం ఇద్దరు వ్యక్తులు యాబై ఇళ్లలో దొంగతనం చేశారంటే, వారికి ఇంటికి సంబంధించిన వివరాలు ఎలా తెలిశాయి? అనేది పోలీసులకు అంతుపట్టదు. గాయత్రి(శ్రద్ధా శ్రీనాథ్) నేతృత్వంలో ఓ టీమ్‌ను నియమిస్తారు. గాయత్రి ప్రేమికుడు చంద్రు(విశాల్) ఓ మిలటరీ ఆఫీసర్. ఆయన ఇంట్లోనూ దొంగలు పడతారు. చంద్రు నాయనమ్మ(కె.ఆర్.విజయ)ను కొట్టి డబ్బుతో పాటు చంద్రు నాన్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చక్ర అవార్డ్ పతాకాన్ని కూడా దొంగలిస్తారు. తన తండ్రి గౌరవార్థం ప్రభుత్వం ఇచ్చిన అవార్డు దొంగతనం జరగడంతో చంద్రు రంగంలోకి దిగుతాడు. గాయత్రితో కలిసి దొంగలను పట్టుకునే పథకాలు వేస్తాడు. చివరకు చంద్రు, గాయత్రి దొంగలను పట్టుకున్నారా? లీల(రెజీనా కసాండ్ర) ఎవరు? ఆమెకు దొంగతనం కేసుకు ఉన్న లింకేంటి? ఒకేసారి ఇద్దరు దొంగలు యాబై ఇళ్లలో ఎలా దొంగతనం చేశారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే.. విశాల్ మిలటరీ ఆఫీసర్ రోల్‌లో ఫిట్‌గా కనిపించాడు. పాత్రలో ఒదిగిపోయాడు. తన కటౌట్‌కు తగినట్టు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. సినిమా ప్రారంభం తర్వాత పదిహేను నిమిషాలకు విశాల్ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత విశాల్ సినిమాను తన భుజాలపై తీసుకెళ్లే వన్ మ్యాన్ షో చేశాడు. గాయత్రి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్, పోలీసులను కన్నుగప్పి హ్యాకింగ్ చేసి దొంగతనం చేయించే మాస్టర్ మైండ్ లీల పాత్రలో రెజీనా కసాండ్ర చక్కగా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ కంటే, రెజీనా పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది. సెకండాఫ్ అంతా రెజీనా పాత్రనే సినిమాను క్యారీ చేస్తుంది. ఇక కె.ఆర్.విజయ, మనోబాల పాత్రలో కథానుగుణంగా ఉన్నాయి.
సాంకేతికంగా చూస్తే దర్శకుడు ఎం.ఎస్.ఆనందన్ సైబర్ నేరాల చుట్టూ కథను రాసుకోవాలనుకోవడం బాగానే ఉంది కానీ.. గ్రిప్పింగ్‌గా కథను రాసుకోలేకపోయాడు. తను రాసుకున్న కథలో హీరో విశాల్‌ను హైలైట్ చేయడానికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను తక్కువ చేసి చూపించడానికి చేసిన ప్రయత్నం సుస్పష్టంగా కనిపించింది. కథలో చాలా లూప్ హోల్స్ కనిపిస్తాయి. రెజీనా పాత్రను రివీల్ చేసిన తర్వాత హీరోకి, విలన్‌గా మధ్య ఉండాల్సిన బలమైన, ఎమోషనల్, తెలివైన సన్నివేశాలు తేలిపోయాయి. దాదాపు నాలుగు గంటల్లో పోలీసులకు మళ్లీ బాధితులు ఫోన్స్ చేస్తూనే ఉంటారు. కేవలం ఇద్దరు దొంగలు యాబై ఇళ్లలో దొంగతనం చేయడమనేది అసాధ్యం. ఇలా పాయింట్స్ ప్రేక్షకుడికి అన్సర్ దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. బాలసుబ్రమణియం సినిమాటోగ్రఫీ బావుంది. మొత్తానికి విశాల్ అభిమానులకు తప్ప మరో ప్రేక్షకుడికి సినిమా నచ్చదు.
బోటమ్ లైన్: ప్రేక్షకులను ఆకట్టుకోడానికి విశాల్ వేసిన ‘చక్ర’ వ్యూహం ఫలించలేదు
Comments