Download App

Chaavu Kaburu Challaga Review

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’ హిట్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన హీరో కార్తికేయ‌కు ఆ త‌ర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం రాలేదు. ఈ నేప‌థ్యంలో ప‌రిమిత బ‌డ్జెట్‌తో సినిమాల‌ను నిర్మిస్తూ విజ‌యాల‌ను అందుకుంటోన్న గీతాఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో కార్తికేయ న‌టించిన చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. టైటిల్ విన‌ప్పుడు.. టైటిల్ ఏంటి ఇలా ఉంది అని కూడా చాలా మంది అనుకున్నారు. దానికి త‌గ్గ‌ట్లుగానే హీరో శ‌వాల బండి డ్రైవ‌ర్, భ‌ర్త చ‌నిపోయిన హీరోయిన్‌ని హీరో ప్రేమిస్తాడ‌ని సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూడ‌గానే తెలిసింది. ఇలాంటి మాస్ పాత్ర‌లో బ‌స్తీ బాల‌రాజుగా కార్తికేయ న‌టించ‌డానికి రీజ‌నేంటి?  ఈ చావుక‌బురు చ‌ల్ల‌గా టైటిల్ పెట్ట‌డానికి రీజ‌నేంటి?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థేంటో చూద్దాం...

క‌థ‌:

స్వ‌ర్గ‌పురి వాహ‌నం(మృత దేహాల‌ను తీసుకెళ్లే వాహ‌నం)కు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే బస్తీ బాల‌రాజు ఓ అంతిమ యాత్ర‌కు వెళతాడు. అక్క‌డ చనిపోయిన వ్య‌క్తి ప‌క్క నుండే అమ్మాయి మ‌ల్లిక‌(లావ‌ణ్య త్రిపాఠి)ని ప్రేమిస్తాడు. అయితే మ‌ల్లిక‌, చ‌నిపోయిన వ్య‌క్తి భార్య అని తెలుస్తుంది. అయినా కూడా త‌న ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేసి ప్రేమిస్తానంటాడు. అంద‌రూ బాల‌రాజు చేసే ప‌నిని తిట్టినా, అత‌ను మాత్రం మ‌ల్లిక‌ను ప్రేమిస్తాడు. మ‌రోవైపు బాల‌రాజు త‌న త‌ల్లి గంగ‌మ్మ‌(ఆమ‌ని), మోహ‌న్‌(శ్రీకాంత్ అయ్య‌ర్‌) అనే వ్య‌క్తిని ప్రేమిస్తుంద‌ని తెలుసుకుని కోపం తెచ్చుకుంటాడు. అయితే త‌న త‌ల్లి జీవితంలో త‌న కోసం, త‌న తండ్రి కోసం ఎలాంటి త్యాగాలు చేసిందో తెలుసుకుని అమ్మ‌కు తానే పెద్ద దిక్కుగా మారి ఆమెకు మోహ‌న్‌తో పెళ్లి చేయాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో మ‌ల్లిక క్ర‌మంగా బాల‌రాజుకు ద‌గ్గ‌ర‌వుతుంది. అలాంటి ప‌రిస్థితుల్లో బాల‌రాజు జీవితంలో అనుకోని ప‌రిణామం జ‌రుగుతుంది. అప్పుడు బాల‌రాజు జీవితం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంది?  బాల‌రాజు, మ‌ల్లిక ఒక్క‌ట‌య్యారా?  లేదా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

ఇప్పటి వరకు కార్తికేయ ప్లే బోయ్‌, లవర్‌ బోయ్‌ తరహా పాత్రలతో మెప్పించాడు. కానీ అందుకు భిన్నంగా ఈసారి రూటు మార్చి బస్తీ బాలరాజు అనే పక్కా ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా మొత్తాన్ని తానే ముందుండి నడిపించాడు. తన లుక్కే కాదు, క్యారెక్టర్‌ డిజైనింగ్‌, డైలాగ్‌ డెలివరీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాగే గ్లామర్‌ పాత్రల్లో నటించిన లావణ్య కాస్త డీ గ్లామర్ పాత్రధారి మల్లికగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె పాత్ర చిత్రీకరణ కూడా కొత్తగానే ఉంది. ఇక హీరో అమ్మ.. గంగమ్మ పాత్రలో ఆమని చక్కగా చేసింది. ఆమని ఆ పాత్రను క్యారీ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్‌ మావయ్య పాత్రలో మురళీశర్మ తనదైన నటనతో మెప్పించాడు. ఇలాంటి పాత్రలు చేయడం తనకేమీ కొత్తకాదనే రీతిలో పాత్రను ముందుకు తీసుకెళ్లాడు మురళీశర్మ. ఇక శ్రీకాంత్‌ అయ్యర్‌, భద్రమ్‌ తదితరులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.

పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అలాంటి పుట్టుక, చావుకు మధ్య జీవితాన్ని సంతోషంగా స్వర్గంలా గడపాలా, లేక నరకంలా గడపాలా అనేది మనిషి చేతిలోనే ఉంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు కౌశిక్‌ పెగళ్లపాటి డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్స్‌తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే కథనం బలంగా లేదు. హీరో క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసిన తర్వాత హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకుడికి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో ఆమని, కార్తికేయ పాత్రలు సినిమాను లీడ్‌ చేస్తాయి. ఎమోషనల్‌ యాంగిల్‌లో సినిమా రన్‌ అవుతుంది. హీరో, మురళీ శర్మ మధ్య ఉండే ఎమోషనల్‌ ట్రాక్‌, డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించిన పాటల్లో తొలి పాట బావుంది. మిగిలిన పాటలేవీ బాలేవు. నేపథ్య సంగీతం బావుంది. కరమ్‌ చావ్లా, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. ఫస్టాఫ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.

బోటమ్ లైన్‌:  చావు కబురు చల్లగా.. కాస్త నెమ్మదిగా.. తర్వాత ఎమోషనల్‌గా

Read Chaavu Kaburu Challaga Review in English

Rating : 2.8 / 5.0