అన్‌లాక్-2 విధివిధానాలను ప్రకటించిన కేంద్రం
- IndiaGlitz, [Tuesday,June 30 2020]
లాక్డౌన్ సడలింపులను ప్రకటిస్తూ గతంలో ఒకసారి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. అనంతరం తాజాగా మరోసారి కేంద్రం మరికొన్ని అంశాలకు సడలింపులను ప్రకటించింది. దీని ప్రకారం మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై నిషేధం యథావిధిగా కొనసాగనుంది. అలాగే సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలకు నిషేధం విధించనుంది. విద్యాసంస్థలపై కూడా నిషేధం కొనసాగనుంది. కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్డౌన్ కొనసాగనుంది. వీరికి నిత్యావసరాల నిమిత్తం మాత్రమే బయటకు వచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది.
కేంద్ర, రాష్ట్ర శిక్షణ సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు కేంద్రం అవకాశమిచ్చింది. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం లభించనుంది. ఇకపై నూతన మార్గదర్శకాల ప్రకారం కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే ఉండనుంది. నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగించనుంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. బయటకు ఎక్కడికెళ్లినా మనిషికీ, మనిషికి మధ్య 6 అడుగుల దూరాన్ని పాటించాల్సిందేనని కేంద్రం ప్రకటించింది.
దుకాణాలన్నీ మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో మాదిరిగానే.. వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి... అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతి ఉండనుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మద్యపానం, పాన్, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడంపై నిషేధం విధించింది. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. అవకాశం మేరకు ఇంటి నుంచి పని చేసేందుకే ప్రయత్నించాలని కేంద్రం తెలిపింది.