ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ‘‘Z’’ కేటగిరీ భద్రత... కేంద్రం కీలక నిర్ణయం
- IndiaGlitz, [Friday,February 04 2022]
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్‌కు తక్షణమే సీఆర్పీఎఫ్ బలగాలతో ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. 22 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించనుంది కేంద్రం. వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు.
కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా మీరట్ జిల్లా కిట్టోర్‌లో జరిగిన ప్రచారానికి వెళ్లారు అసదుద్దీన్ ఒవైసీ. ప్రచారం ముగించుకుని అనంతరం ఢిల్లీ వెళ్తుండగా.. హాపుర్-గాజీయాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద గురువారం సాయంత్రం ఆయన కాన్వాయ్‌పై దుండుగులు మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన నుంచి అసదుద్దీన్ తృటిలో తప్పించుకున్నారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీకి చేరుకున్న అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. తనపై పెద్ద కుట్ర జరిగిందని, అల్లా దయవల్ల బయటపడ్డానని చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేస్తానని అసదుద్దీన్ తెలిపారు. యూపీలో మరో వారంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సమయంలో అసదుద్దీన్‌పై కాల్పుల జరగడం అక్కడి రాజకీయాలను వేడెక్కించింది.