YS Jagan: ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన బిడ్డల జీవితాలను మారుస్తుంది : సీఎం వైఎస్ జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో దాదాపు 561.88 ఎకరాల్లో .. రూ.834 కోట్ల వ్యయంతో ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన యూనివర్సిటీతో పేద విద్యార్ధులకు మంచి భవిష్యత్తు నెలకొంటుందని సీఎం ఆకాంక్షించారు. ఇప్పుడు ఏర్పాటు చేయనున్న వర్సిటీతో కలిపి ఏపీలో ఇది రెండో సెంట్రల్ యూనివర్సిటీ అని జగన్ అన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా గిరిజనులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
గిరిజనులకు రెండు జిల్లాలు ఇచ్చాం:
దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశామని.. పాడేరులో మెడికల్ కాలేజ్, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లుగా జగన్ వెల్లడించారు. ఎనిమిదో తరగతి నుంచే విద్యార్ధులకు ల్యాప్టాప్లు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గిరిజనులకు రెండు జిల్లాలను , గిరిజన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎంను కట్టబెట్టామని జగన్ చెప్పారు. గిరిజనులకు ప్రత్యేక ఎస్టీ కమీషన్ ఏర్పాటు చేశామని.. ఏజెన్సీ ప్రాంతాల్లోని 497 సచివాలయాల్లోని వాలంటీర్లంతా గిరిజనులేనని సీఎం వెల్లడించారు.
4.58 లక్షల గిరిజనులకు మేలు చేశాం:
గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగినవారని, తరతరాలుగా వాళ్లు అభివృద్ధికి దూరంగా వుంటున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోపా కార్యక్రమాలు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యా దీవెన, వసతి దీవెనను తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 లక్షల 58 వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. గిరిజనుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 36 లక్షల 12 వేల గిరిజన కుటుంబాలకు డీబీటీ ద్వారా .. రూ.11,547 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని జగన్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout