Medigadda Barrage: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని పరిశీలించిన కేంద్ర బృందం
Send us your feedback to audioarticles@vaarta.com
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నేడు బ్యారేజ్‌ను పరిశీలించి నివేదిక రూపొందించింది. వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించారు. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. ఎలా కుంగింది అనే విషయాన్ని ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత బ్యారేజీ నుంచి కేంద్ర బృందం సభ్యులు వెనుదిరిగారు. మరో రెండు రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందజేయనున్నారు.
భారీ శబ్దంతో కుంగిపోయిన 20వ పిల్లర్..
ఈ బ్యారేజీ కుంగడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నీటిని విడుదల చేశారు. దీంతో నీటి మట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంది. బ్యారేజ్ ఎగువ నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. గత శనివారం రాత్రి భారీ శబ్దంతో 20వ పిల్లర్ కుంగిపోయింది. దీంతో బీ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. అలాగే బ్యారేజీ క్రస్ట్ గేటుకు పగుళ్లు కూడా వచ్చాయి. అధికారులు వంతెనను మూసివేసి రాకపోకలను నిలిపివేశారు. గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీకి ఒకవైపు మహారాష్ట్ర, రెండోవైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
కేంద్ర జలవనరులశాఖ మంత్రికి లేఖ రాసిన కిషన్ రెడ్డి..
బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతను పర్యవేక్షించేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన షెకావత్ కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బ్యారేజీ కుంగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్, కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారని తెలిపారు. బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరపాలని రేవంత్ కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments