EPF అకౌంట్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
- IndiaGlitz, [Wednesday,May 13 2020]
కరోనా కష్టకాలంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం తియ్యటి శుభవార్త చెప్పింది. మంగళవారం నాడు జాతినుద్ధేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్యాకేజీ వివరాలను బుధవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిశితంగా మీడియా ముఖంగా వివరించారు. ఈ సందర్భంగా దాదాపు అన్ని రకాల వర్గాల వారికి వరాల వర్షం కురిపించారు. కాగా.. ఇందులో భాగంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒకింత శుభవార్తే చెప్పారు.
మూడ్నెళ్లు పాటు..!
ఏదైనా కంపెనీల్లో 100 మంది లోపు ఉద్యోగులు పనిచేస్తుంటే.. వారిలో రూ. 15,000 లోపు వేతనం ఉన్నవారికి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం మూడు నెలల పాటు.. అంటే మొత్తం 24 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలోనే కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. మార్చి, ఏప్రిల్, మే నెలలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పగా.. ఇది మరో మూడు నెలలు ఈ స్కీమ్ పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అనగా.. జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో కూడా ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాట. దీనివల్ల 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేసే 72 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది.
తగ్గిస్తున్నాం.. ఇకపై..!
ఇదిలా ఉంటే.. ఉద్యోగుల వేతనం పెంచేందుకు కూడా కేంద్రం మరో కీలక నిర్ణయే తీసుకుంది. 12% చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. అంటే ఇకపై ఎంప్లాయర్ షేర్ 10 శాతం, ఎంప్లాయీ షేర్ 10 శాతం చెల్లిస్తే చాలన్న మాట. అంటే ఉద్యోగులకు 4 శాతం వేతనం అదనంగా అకౌంట్‌లో క్రెడిట్ కానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 12 శాతం చొప్పున ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్ చెల్లిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక ఇప్పటికే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనం... వీటిలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.