జగన్‌ సర్కార్‌కు ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

  • IndiaGlitz, [Friday,August 23 2019]

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఇప్పటికే వైఎస్ జగన్‌ సర్కార్‌కు ఏపీ హైకోర్టు జలక్ ఇచ్చిన విషయం విదితమే. అయితే తాము ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు చెప్పే అన్నీ చేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. విజయసాయి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాంను ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. పోలవరంపై తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కేంద్రానికి రాష్ట్రం చెప్పాల్సిందేనని తేల్చిచెప్పారు.

మీ ఇష్టమొచ్చినట్లు అంటే కుదరదు..!

డబ్బులు చెల్లించేది కేంద్రమే కాబట్టి అన్నీ చెప్పి తీరాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటుంటే కేంద్రం ఊరుకోబోదు. కేంద్రం ఆశీస్సులతోనే ఈ పనులన్నీ చేస్తున్నామంటున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అంతా అబద్ధం. సమాఖ్య వ్యవస్థలో ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవు. రాష్ట్రం, కేంద్రం ఎవరి పని వారు చేసుకుంటూ పోవాల్సిందే. పోలవరం అథారిటీ నుంచి దీనిపై నివేదిక కోరాము. నివేదిక వచ్చిన తర్వాత పోలవరంపై తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలులేదు అని కేంద్రమంత్రి.. జగన్ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.