తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్ర బడ్జెట్!
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు అనుకున్నంతగానే ఉంటాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఒకటి అర తప్ప ఆశించినంతగా కేటాయింపులు లేకపోవడం గమనార్హం. దీంతో అటు తెలంగాణ.. ఇటు ఏపీ ప్రజలు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్రజేస్తున్నారు. ఏదో శుభవార్త చెబుతారనుకుంటే ఇలా తమ ఆశలపై నీళ్లు చల్లితే ఎలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే కొన్ని విషయాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు భేష్ అని కితాబిస్తున్నారు కూడా.
ఏపీకి ఏం ఇచ్చారు..!?
లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వాన్ని గట్టిక్కించేందుకు గాను ఈ బడ్జెట్లో శుభవార్తలు ఏమైనా చెబుతుందేమోనని సర్కార్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఆశలన్నీ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆవిరయ్యాయి. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలో సాంకేతిక విద్య పట్ల కేంద్రం మొండి చెయ్యి చూపించడం తీవ్ర నిరాశ కలిగించే విషయం. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు.. ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ. 8కోట్లు మాత్రమే కేటాయించినట్లు స్పష్టం చేసింది. అయితే ఏపీలోని ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు మాత్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్తో ఏపీలోని వీటికి నిర్వహణ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని.. దీంతో మరింత అప్పుల్లో కూరుకుపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
విజయసాయిరెడ్డి రియాక్షన్ ఇదీ..
ఏపీకి ఏదో ఇస్తుందని కేంద్రంపై కోటి ఆశలు పెట్టుకుంటే బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, పోలవరం, రాజధాని ప్రస్తావనే లేకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ఆయన.. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డులు ఇవ్వడం మంచిదేనన్నారు.
తెలంగాణకు ఏం ఇచ్చారు..!?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీతో పాటు తెలంగాణ సర్కార్ కూడా ఎన్నో ఆశలుపెట్టుకుంది. అయితే ఆ ఆశలన్నీ బడ్జెట్ ప్రసంగం ప్రాంభమైన కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయాయి. తెలంగాణకు ఆశించినంతగా కాదు కదా.. ఒకటి అర తప్ప అస్సలే కేటాయింపులు లేకపోవడం గమనార్హం. హైదరాబాద్ ఐఐటీకి రూ. 80 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ ఎంపీలు కేంద్రంపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
టీఆర్ఎస్ ఎంపీల రియాక్షన్ ఇదీ...
కొత్త బడ్జెట్ అందరికీ ఊరటగా ఉంటుందని అనుకున్నాం కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ఏ రాష్ట్రానికి, ప్రజలకు అంత ఉపయోగకరంగా లేదన్నారు. ప్రతి ఇంటికి తాగు నీరు బడ్జెట్లో పెట్టడం మాత్రమే సంతోషకరమన్నారు. ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో అమలు చేస్తున్నామని, దాన్నే కేంద్రం పేరు మార్చి బడ్జెట్లో పెట్టుకుందన్నారు.
మొత్తానికి చూస్తే... తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపింది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని అనుకుంటున్న బీజేపీ ఆ రేంజ్లోనే కేటాయింపులు కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని ఇరు రాష్ట్రాల కమలనాథులు సైతం ఒకింత అసంతృప్తికి లోనవుతున్నారట. మరోవైపు ఇప్పుడిప్పుడే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కీలకనేతలను చేర్చుకున్న.. మరికొందరు చేర్చుకునే పనిలో ఉన్న బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com