Central government:సామాన్యులకు కేంద్రం శుభవార్త.. రూ.29లకే కిలో బియ్యం..

  • IndiaGlitz, [Friday,February 02 2024]

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అందించేలా నిర్ణయం తీసుకుంది. 'భారత్ రైస్' (Bharat Rice) పేరిట రూ.29లకే కిలో బియ్యం విక్రయించనున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనుంది. ఈ -కామర్స్ ప్లాట్ ఫామ్స్‌లోనూ అమ్మకాలు జరపనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో వివరాలు ప్రకటించాలని ట్రేడర్లను ఆదేశించింది. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. గతేడాది కాలంగా బియ్యం ధరలు 15 శాతం పెరిగాయని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్ మార్కెట్ కోసం కేటాయించనట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి బియ్యం మినహా ఇతర ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లు, ప్రాసెసర్లు లేదా మిల్లర్లు తమ వద్ద ఉన్న బియ్యం నిల్వల స్థితిని ప్రకటించాలని ఆదేశించారు. అక్రమంగా నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా ఇప్పటికే 'భారత్ అటా'(Bharat Aata) కింద గోధుమ పిండిని కిలో రూ.27.50 పైసలకు.. 'భారత్ దాల్' (Bharat Dall) పేరిట శనగపప్పును కిలో రూ.60కు కేంద్రం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బియ్యం రూ.60-70 వరకు అమ్ముతున్నారు. దీంతో ఆ ధరలను అదుపులోకి తెచ్చేందుకు 'భారత్ రైస్' పథకం అమల్లోకి తీసుకొస్తుంది. దీని వల్ల పేదలకు ప్రయోజనం చేకూరనుంది.