పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్..

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొద్ది రోజులుగా నెలకొన్న గందరగోళంపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం బకాయిలపై సానుకూలంగా స్పందించింది. ఎలాంటి షరతులూ లేకుండా పోలవరం ప్రాజెక్ట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రూ.2,234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖకు మెమో పంపింది. పీపీఏ ప్రక్రియ పూర్తి చేయాలంటూ జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ మెమో పంపింది.

ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చింది. అంచనా వ్యయానికి కేంద్రం భారీ కోత విధించడంతో పాటు... తాజాగా లెక్కలు చెబితేనే మిగతా రూ.9,288 కోట్లు చెల్లిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో అప్రమత్తమైన ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీతో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని లేఖలో జగన్ పేర్కొన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి వంటిదని.. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.