ఆరు పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం..
- IndiaGlitz, [Tuesday,September 22 2020]
2021-22 సంవత్సరానికి గాను ఆరు రబీ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్సభలో ప్రకటన చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మద్దతు ధర తొలగించబడుతుందని విపక్షాలు చేస్తున్న అసత్యాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇస్తుందన్నారు.
తాను చేసిన ఈ ప్రకటనతో విపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని తేలిపోతుందని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఎంఎస్పీ, మార్కెట్ కమిటీ వ్యవస్థలను ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుందన్నారు. కాగా.. కనీస మద్దతు ధరపై నరేంద్రసింగ్ తోమర్ ప్రకటన చేయగానే పలువురు కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఒకవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం మద్దతు ధరను పెంచడం గమనార్హం. కనీస మద్దతు ధర ఈ కింది పంటలకు పెంచారు.
గోధుమ : రూ. 50 పెరుగుదల
బార్లీ : రూ. 75 పెరుగుదల
కుసుమ : రూ. 112 పెరుగుదల
శనగపప్పు : రూ. 225 పెరుగుదల
ఆవాలు : రూ. 225 పెరుగుదల
ఎర్రపప్పు : రూ. 300 పెరుగుదల